Caste Census : సర్వేలో సమగ్ర వివరాలు అందుతాయా? సందేహమేనంటున్నారుగా?
తెలంగాణలో వారం రోజుల క్రితం ప్రారంభమయిన కులగణన సర్వే విషయంలో ఒకింత ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు
తెలంగాణలో వారం రోజుల క్రితం ప్రారంభమయిన కులగణన సర్వే విషయంలో ఒకింత ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. కులగణన సర్వేలో వ్యక్తిగత వివరాలను కూడా అడుగుతుండటంతో వాటిని చెప్పేందుకు ప్రజలు నిరాకరిస్తున్నారు. ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. వ్యక్తిగత కుటుంబ వివరాలను చెప్పేందుకు కూడా పెద్దగా ఆసక్తి కనపర్చడం లేదు. కొందరు తప్పుడు సమాచారం ఇచ్చి సిబ్బందిని త్వరగా పంపుతున్నారని తెలిసింది. దీంతో కులగణన సర్వే ఏ మేరకు సక్సెస్ అవుతుందన్నది చూడాల్సి ఉంది. సమగ్ర సమాచారం లభిస్తుందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.
ఫోన్ నెంబర్లు ఇచ్చేందుకు ....
ఫోన్ నెంబర్లు ఇచ్చేందుకు ఎక్కువ మంది ప్రజలు నిరాకరిస్తున్నట్లు ఎన్యుమరేటర్లు చెబుతున్నారు. అదే సమయంలో ఆస్తుల వివరాలను కూడా చెప్పేందుకు ముందుకు రావడం లేదు. ఆస్తుల వివరాలను తీసుకుని మీరు ఏం చేసుకుంటారన్న ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. కొందరయితే నేరుగా తాము ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేది లేదని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. మరికొందరు మాత్రం సమాధానాలను దాటవేసేందుకు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమగ్ర సర్వే కారణంగా తమకు ప్రస్తుతం అందుతున్న సంక్షేమ పథకాలు అందకుండా పోతాయోమోనన్న భయం ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
రేషన్ కార్డులను తొలగిస్తారని...
అదేసమయంలో రేషన్ కార్డులను కూడా తొలగిస్తారన్న ప్రచారంతో పూర్తి సమాచారం చెప్పేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. ఒకటి కాదు రెండు కాదు.. 75 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. బీసీ డిక్లరేషన్ అయితే తమకు ఈ సర్వే వల్ల ఏం లాభం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నవంబరు 6వ తేదీ నుంచి కులగణన సర్వేచేపట్టినా ఇప్పటి వరకూ పెద్దగా సర్వే ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణం బీసీ కులగణన చేపడితే తమ వివరాలను ఎందుకు సేకరిస్తున్నారన్న ప్రశ్నలకు ఎన్యుమరేటర్లకు సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు.ఇరవై ఆరు రోజుల పాటు ఈ సర్వే కొనసాగుతుందని తెలిసినప్పటికీ ప్రజలు ముందుకు రాకపోవడానికి ప్రధాన కారణం తమకు ఏమాత్రం లాభం లేనిసర్వేకు ఎందుకు సహకరించాలని ప్రజలు కోరుతున్నారు.