YSRCP : జగన్ కు ఎన్నికల్లో పోటీ చేసేందుకూ ఎవరూ దొరకరా? అసలు నిజం ఏంటి?

ఆంధ్రప్రదేశ్ అయినా.. తెలంగాణ అయినా రాజకీయాలు ఒకలాగానే ఉంటాయి. అధికారంలో లేనప్పుడు పార్టీల నుంచి వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది

Update: 2024-11-12 06:13 GMT

ఆంధ్రప్రదేశ్ అయినా.. తెలంగాణ అయినా రాజకీయాలు ఒకలాగానే ఉంటాయి. అధికారంలో లేనప్పుడు పార్టీల నుంచి వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక ఆ పార్టీ కోలుకోలేదన్న సంకేతాలు బలంగా కనిపిస్తాయి. అధికార పక్షంలోకి రాకపోకలు ఎక్కువగా జరుగుతుండటంతో అది బలంగా కనిపిస్తుంది. అయితే ఏది వాపు? ఏది నిజమైన బలం అన్నది తేలడానికి ఎన్నికల సమయం వచ్చే నాటికి కాని తేలదు. ఇటు తెలంగాణలో కేసీఆర్ అయినా అటు ఏపీలో జగన్ అయినా ఇప్పుడు డీలా పడిపోయిన సంగతి వాస్తవమే. కానీ రానున్న ఎన్నికల నాటికి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకరని అధికార పార్టీలు చేసే విమర్శలకు మాత్రం అర్థం లేనివిగా చెప్పాలి.

కాంగ్రెస్ కూడా అంతే...
ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉంది. అసలు కాంగ్రెస్ పని అయిపోయినట్లేనని అందరూ భావించారు. పోటీకి కూడా ఎవరూ ముందుకు రాకపోవచ్చని నాటి అధికార బీఆర్ఎస్ పార్టీ బీరాలు పలికింది. కాంగ్రెస్ పని అయిపోయినట్లేనని, దానికి ఓటు వేసే పరిస్థితి కూడా ఉండదని ఎద్దేవా చేసింది. అయితే 2023 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. పోటీకి దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరిగింది. అధికారంలోకి వచ్చేసింది. అప్పటి వరకూ విజయం విషయంలో తమకు తిరుగులేదనుకున్న బీఆర్ఎస్ చివరకు ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి భంగపడింది. ఇప్పుడు కాంగ్రెస్ లోకి వలసలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ దిగజారిపోయింది.
టీడీపీ పనిఅయిపోయిందని...
ఆంధ్రప్రదేశ్ లోనూ 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత ఇక టీడీపీ ఉండదని విశ్లేషకులు సయితం తేల్చేశారు. పోటీకి అభ్యర్ధులు దొరుకుతారా? అంటూ ప్రచారం కూడా జోరుగా నిర్వహించారు. కానీ ఎన్నికల నాటికి అనూహ్యంగా టీడీపీ కూటమి పుంజుకుంది. అధికారంలో ఉన్న వైసీపీ రెండోసారి తమకు తిరుగులేని విజయం సాధిస్తామని విశ్వసించింది. తాము అమలు చేసిన సంక్షేమపథకాలు, నగదు బదిలీ వంటి వాటితో వైసీపీకి తిరుగులేదని భావించింది. కానీ కట్ చేస్తే... ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి జాతకం తిరగబడింది. వైసీపీకి కేవలం పదకొండు స్థానాలు మాత్రమే వచ్చాయి. కూటమికి 164 స్థానాలు దక్కించుకుని అగ్ర స్థానంలో నిలిచింది.
వచ్చే ఎన్నికల నాటికి...
ఈసారి జరిగే ఎన్నికల్లోనూ పరిస్థితులు అలాగే ఉంటాయి. ఇప్పుడు వైసీపీ పరిస్థితి దిగజారుతున్నట్లే కనిపిస్తుంది. అలాగే కారు పార్టీ కూడా కనుమరుగు అవుతుందన్న సంకేతాలు కనిపిస్తాయి. కానీ అవి పెద్దగా పనిచేయవు. ఎన్నికల నాటికి పరిస్థితులు మారిపోతాయి. వైసీపీలో చేరిక సంఖ్య ఊపందుకుంటుంది. అలాగే బీఆర్ఎస్ కు కూడా బలమైన నేతలు మద్దతుగా నిలిచే అవకాశముంది. ఇప్పుడున్నపరిస్థితులు ఎన్నికల నాటికి కనిపించవు.అప్పటికి పూర్తిగా ఛేంజ్ అవుతాయి. అందుకే ఏపీలో జగన్ కానీ, తెలంగాణలో కేసీఆర్ కానీ రాజకీయంగా ఎలాంటి టెన్షన్ లేకుండా ధీమాగా ఉన్నారు. కొన్ని దఫాలుగా జరుగుతున్న తంతు ఇదేకావడంతో పార్టీలు నేతల కోసం వెదుక్కోవాల్సిన పరిస్థితి ఉండనే ఉండదన్నది గత ఎన్నికల సంగతులు తేల్చి చెబుతున్నాయి.
Tags:    

Similar News