Telangana : వధూవరులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. లక్షతో పాటు తులం బంగారం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది

Update: 2024-11-24 07:32 GMT

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. తాజాగా కల్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు సిద్ధమయింది. ఇప్పుడు తులం బంగారం డెబ్భయి వేల రూపాయలు దాటేసింది. అంటే ఒక్కొక్క వధువుకు లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాదరావు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

ఎన్నికల హామీల అమలులో ...
ఎన్నికల హామీలలో భాగంగా లక్ష రూపాయల నగదుతో పాటు పెళ్లి చేసుకున్న పేదింటి వధువుకు తులం బంగారం కూడా ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుంది. అయితే ఇప్పటికే పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమయింది. అయితే దీనికి సంబంధించి అర్హతలు ఇంకా నిర్ణయించాల్సి ఉంటుంది. అన్ని సంక్షేమ పథకాలు మాదిరిగానే తెలుపు రంగు కార్డు ఉన్న వారంతా ఈ పథకానికి అర్హులేనని ప్రాధమికంగా అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఎప్పటి నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. తెలంగాణలో పేదింటి వారు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారు? ఎంత మొత్తంలో లక్ష నగదుతో పాటు, తులం బంగారాన్ని కూడా ఇచ్చేందుకు అవసరమైన నిధులను సమీకరించాలని రేవంత్ అధికారులను ఆదేశించడంతో త్వరలోనే ఈ పథకం గ్రౌండ్ అయ్యే అవకాశాలున్నాయి.
సీజన్ మరో రెండు నెలలు...
పెళ్లిళ్ల సీజన్ మరో రెండు నెలల పాటు ఉండనుండటంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుండటంతో ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా మహిళలను ఆకట్టుకునేలా ఇప్పటికే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం వంటివి కల్పించారు. దీంతో పాటు కల్యాణ లక్ష్మి పథకాన్ని కూడా అమలు చేస్తే మహిళలకు హామీల అమలులో పెద్దపీట వేసినట్లవుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా త్వరలో విడుదల చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఈ సీజన్ నుంచి దీనిని అమలు పర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించినట్లు సమాచారం. మొత్తం మీద తెలంగాణ మహిళలకు మరో గుడ్ న్యూస్ త్వరలోనే అందనుంది. బహుశ కొత్త ఏడాది నుంచి ఈ పథకం అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Tags:    

Similar News