Cold Waves : చలికొరికి చంపేస్తుందిగా.. తట్టుకోలేకపోతున్న తెలంగాణ జనం
తెలంగాణలో గత కొద్ది రోజులుగా చలి గాలుల తీవ్రత ఎక్కువయింది. ఉదయం పన్నెండు గంటలయినా చలి వీడటం లేదు.;
తెలంగాణలో గత కొద్ది రోజులుగా చలి గాలుల తీవ్రత ఎక్కువయింది. ఉదయం పన్నెండు గంటలయినా చలి వీడటం లేదు. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా చలిగాలుల తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు కూడా భయపడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అనేక రకాల వ్యాధులు బారిన పడుతున్నారు. ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
సీజనల్ వ్యాధులతో...
ప్రధానంగా చలి తీవ్రత పెరగడంతో జ్వరంతో పాటు డయేరియా, ఒళ్లు నొప్పులు, దగ్గుతో పాటు చికెన్ గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులు ఎక్కువగా సంక్రమించాయని వైద్యులు తెలిపారు. చికెన్ గున్యా, డెంగ్యూతో బాధపడుతూ వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు ఈ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రధానంగా న్యుమోనియాతో బాధపడే వారు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులతో పాటు చిన్నారులు, వృద్ధులు అత్యధికంగా ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య అధికంగా ఉందని చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడిపోతున్నాయి.
కనిష్ట ఉష్ణోగ్రతలు...
సంగారెడ్డి జిల్లా కోహిర్ లో కనిష్టంగా పది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. అసీఫాబాద్ జిల్లా సిర్పూర్ లో 9.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఏజెన్సీ ప్రాంతాలలో చలి తీవ్రత అధికంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో సైతం చలి తీవ్రత కొనసాగుతుంది. గ్రేటర్ ప్రజలు చలిపులి పంజా దెబ్బకు గజగజ వణికిపోతున్నారు. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటమే కాకుండా ఉష్ణోగ్రతలు మరింత పతనమయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ శాఖ అధికారులు వెల్లడించారు. ఉదయాన్నే చలిమంటలు వేసుకుని తీవ్రత నుంచి తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ప్రజలు బయటకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకు రావాలని సూచిస్తున్నారు.