నిరసనలపై ఎమ్మెల్సీ కవిత చెప్పిన లాజిక్ విన్నారా?
తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుబడుతూ ఉన్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు.ఢిల్లీ దేశం మొత్తానికి రాజధాని కాబట్టి అక్కడ ధర్నాలు చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదని.. హైదరాబాదులో ధర్నా చేయాలంటే తెలంగాణ అంశాలపై ధర్నా చేస్తే బాగుంటుందని అన్నారు కవిత.
ఆంధ్రా అంశాలపై ఇక్కడ ధర్నాలు చేస్తే హైదరాబాదులో శాంతిభద్రతలకు భంగం వాటిల్లదా.. అని మాత్రమే తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారని కవిత స్పష్టం చేశారు. ఎవరైనా ఎక్కడికైనా రావొచ్చని రేవంత్ రెడ్డి అనవసరంగా భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారన్నారు కవిత. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎప్పుడూ ధర్నాలు, గొడవలు, నిరసనలు, కర్ఫ్యూలు ఉంటాయని.. ఆ పార్టీ చరిత్ర అదేనని కవిత విమర్శించారు. పరిస్థితులను బట్టి ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు రాబట్టుకోవాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఒక రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై పక్క రాష్ట్రంలో చర్చ పెట్టాలనుకోవడం దారుణమన్నారు కవిత. దేశంలో అనేక మంది రాజకీయ నేతలు వేధింపులకు గురవుతుండడడం చూస్తూనే ఉన్నామని.. ఇది ఆయా పార్టీలు, వారి న్యాయ విభాగాలు చూసుకోవాల్సిన విషయమని చెప్పారు కవిత.