జగనన్నకు చెప్పి నేను మీకు జాగా ఇప్పిస్తా: మంత్రి కేటీఆర్

వరంగల్ సమీపంలోని మడికొండ ఐటీ పార్క్‌లో రూ.40 కోట్లతో ఏర్పాటు చేసిన

Update: 2023-10-06 09:27 GMT

వరంగల్ సమీపంలోని మడికొండ ఐటీ పార్క్‌లో రూ.40 కోట్లతో ఏర్పాటు చేసిన క్వాట్రెండ్ సాఫ్టువేర్ కంపెనీని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అది కూడా రెండు తెలుగు రాష్ట్రాల బాగు కోసం మాట్లాడారు. హైదరాబాద్, వరంగల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఐటీ కంపెనీలు రావాలని మంత్రి కేటీఆర్ చెప్పడం విశేషం. రానున్న పదేళ్లలో హైదరాబాద్‌కు వరంగల్‌కు పెద్దగా తేడా ఉండదన్నారు. ఐటీ రంగంలో భవిష్యత్తు అంతా టైర్ 2 నగరాలదే అని.. ఆంధ్రాలోని భీమవరం, నెల్లూరు ప్రాంతాల్లో భవిష్యత్‌లో ఉజ్వలమైన ఉపాధి అవకాశాలు వస్తాయని కేటీఆర్ అన్నారు. ఏపీలోని పిల్లలకు కూడా టాలెంట్ ఏం తక్కువ లేదన్నారు. బెంగళూరులో ఉన్న 40 శాతం మంది ఐటీ ఉద్యోగులు.. ఆంధ్రా, తెలంగాణ వాళ్లేనని అన్నారు. వాళ్లందరూ తిరిగి సొంత ప్రాంతాలకు రావడానికి రెడీగా ఉన్నారని.. ఏపీలోనూ ఐటీ సంస్థలు పెట్టాలని క్వాడ్రంట్‌ సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్ సూచించారు. జగనన్నకు చెప్పి నేను మీకు జాగా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.

వరంగల్ మాత్రమే కాకుండా ఏపీలోని భీమవరం, నెల్లూరుకూ ఐటీ సంస్థలు రావాలన్నారు కేటీఆర్. అక్కడ కూడా ఎన్నారైలు ఐటీ సంస్థలు పెట్టాలని కోరారు. టాలెంట్ ఎవరబ్బ సొత్తు కాదని, టాలెంట్ ఉంటే ఎక్కడైనా కంపెనీలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించవచ్చునని చెప్పారు. అధిక జనాభా నష్టం అని చెప్పారు కానీ అది అబద్ధమన్నారు. మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.


Tags:    

Similar News