రైతు బంధు పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. యాసంగి సీజన్‌లో రెండో పంట సాగుకు డిసెంబర్‌లోనే రైతు బంధు సాయం అందజేస్తామని ప్రకటించారు. శనివారం వనపర్తిలోని నాగవరం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు బంధు సాయానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై ఆదేశాలు జారీ చేయగా ఆర్ధిక శాఖ ఆమోదించిందని చెప్పారు. రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేస్తామని, అన్నదాతలకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు. ఐకేపీ, పీఏసీసీఎస్, ఏఎంసీ, మెప్మా ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల్లోనే మద్ధతు ధర లభిస్తుందని చెప్పుకొచ్చారు. దళారుల మాటను నమ్మొద్దని మంత్రి సూచించారు. యాసంగి సాగుకు నీరు పుష్కలంగా అందుబాటులో వుందని, వరితో పాటు నూనె, పప్పు దినుసులు వంటి పంటలను కూడా పండించాలని నిరంజన్ రెడ్డి రైతులకు సూచించారు.