Telangana : రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్‌కు రెడీ..రైతులకు పండగే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీపావళికి ముందే రైతులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీపావళికి ముందే రైతులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఇప్పటికే మంత్రి వర్గ సమావేశంలో సన్న వడ్ల కొనుగోలుపై ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించారు. అయితే తాజాగా రైతు భరోసా నిధులపై కూడా అప్‌డేట్ రానుంది. త్వరలోనే దీనిపై రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారని తెలిసింది. రైతు భరోసా పథకాన్ని ఇప్పటి వరకూ అమలు చేయకపోవడంపై అనేక రకాలైన విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు రేవంత్ సర్కార్ ను ప్రజల ఎదుట దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును వెలుగులోకి తీసుకు వచ్చింది.
రైతు బంధు నిధులు...
అయినా సరే రైతు భరోసా నిధులు జమ కాకపోవడంతో రైతు వర్గాల్లో కొంత అసంతృప్తి నెలకొందని కాంగ్రెస్ నేతలు కూడా గుర్తించారు. ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున రైతు బంధు నిధులను ఇస్తామని ఎన్నికలలో ఇచ్చిన హామీల్లో చెప్పారు. వ్యవసాయకూలీలకు పన్నెండు వేలను ిఇస్తామని తెలిపింది. ఎన్నికల గ్యారంటీని అమలు చేస్తామని తెలిపారు. అయితే అధికారంలోకి వచ్చి పది నెలలు దాటి ఏడాదికి సమీపిస్తున్నప్పటికీ ఇంతవరకూ రైతు భరోసా నిధులు జమ కాలేదు. రైతులకు రెండు లక్షల రుణమాఫీని మాత్రం ప్రకటించారు. దానిని దశలవారీగా చేస్తున్నారు. డిసెంబరు నాటికి అందరు రైతులకు రుణమాఫీ అవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అంటే ఇంకా నెల రోజుల సమయం ఉంది.
షరతులతో కూడిన...
ఈ సమయంలో అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోతుంది. రైతు భరోసా పథకంలో అర్హతలు కూడా నిర్ణయించారు. పంటలు వేసిన పొలాలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అంటే గత ప్రభుత్వం ఎవరికైనా పొలం ఉంటే చాలు అది సాగు చేసినా, చేయకపోయినా రైతు భరోసా నిధులు జమ అయ్యేవి. కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని వర్తింప చేయాలని నిర్ణయించింది. దీంతో లబ్దిదారుల సంఖ్య తగ్గే అవకాశముంది. అదే సమయంలో ఐదు నుంచి పది ఎకరాలున్న వారికి మాత్రమే రైతు భరోసాఇవ్వాలన్న షరతు కూడా విధించే అవకాశముంది. అంతకు మించి ఉన్న వారికి రైతు బంధు ఇవ్వకపోవచ్చు. వీటన్నింటిపై త్వరలోనే రేవంత్ క్లారిటీ ఇవ్వనున్నారు. ఈరోజో, రేపో రైతు భరోసా ఎప్పటి నుంచి అమలు చేయనున్నామన్న విషయం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటిస్తారని తెలిసింది.