చెంపదెబ్బ వివాదంలో తెలంగాణ హోంమంత్రి
తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తన గన్ మెన్ పై చేయిచేసుకున్నారు
తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తన గన్ మెన్ పై చేయిచేసుకున్నారు. అది కూడా కెమెరాల ముందు ఆయన దురుసుగా ప్రవర్తించారు. ఇదంతా ఒక బొకే కోసం జరిగింది. తలసాని పుట్టిన రోజు వేడుకలకు హాజరైన మహమూద్ అలీ బొకే ఎక్కడంటూ గన్ మెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో సహనం కోల్పోయి గన్ మెన్ చెంప చెళ్లుమనిపించారు. షాక్ అయిన సదరు గన్ మెన్ మంత్రిని అలాగే చూస్తుండిపోయారు. వెనక ఉన్న వ్యక్తుల దగ్గరి నుంచి బొకే తీసుకుని మంత్రికి అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. తలసానిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పారు. ఆయనకు ఇవ్వాల్సిన బొకే ఏదంటూ గన్ మెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు మహమూద్ అలీ. గన్ మెన్ ను దగ్గరకు పిలిచి చెంపపై కొట్టారు. తలసాని హోంమంత్రికి సర్దిచెప్పారు. హోంమంత్రి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.