కేంద్రం కక్ష సాధింపు చర్య కాదా?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయీల అంశంపై హోంశాఖ చొరవ తీసుకోవాలని బోయినపల్లి వినోద్ కుమార్ కోరారు
రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కేంద్ర హోం శాఖదేనని, కేంద్ర విద్యుత్తు శాఖ పరిధిలోది కాదని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఏపీ విభజన చట్టంలో చెబుతున్నదిదేనని ఆయన అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయీల అంశంపై హోంశాఖ చొరవ తీసుకోవాలని బోయినపల్లి వినోద్ కుమార్ కోరారు. ఏపీ విద్యుత్తు సంస్థలే తెలంగాణకు బాకీ ఉన్నాయని ఆయన తెలిపారు.
తెలంగాణకు ఏపీయే బకాయీ...
ఏపీ తెలంగాణ విద్యుత్తు సంస్థలకు 12,940 కోట్ల బకాయీలు ఉందని ఆయన తెలిపారు. దానిని మాత్రం కేంద్ర విద్యుత్ శాఖ పట్టించుకోవడం లేదన్నారు. పైగా తెలంగాణయే ఏపీకి విద్యుత్తు బకాయీల కింద చెల్లించాలంటూ కేంద్ర ఇంధన శాఖ ఆదేశాలు జారీ చేయడం అన్యాయమని అన్నారు. ఇది కక్ష సాధింపు చర్యలో భాగమేనని చెప్పారు. కేంద్ర హోంశాఖ ఈ వివాదంలో జోక్యం చేసుకోవాలని వినోద్ కుమార్ కోరారు. అంతే తప్ప ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.