మోదీతో రేపు కేసీఆర్ కరచాలనం చేస్తారా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు జరిగే ప్రధాని మోదీ కార్యక్రమాల్లో పాల్గొంటారా? లేదా? అన్నది సందేహంగా మారింది.
ప్రధాని నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ రానున్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని కార్యక్రమాల్లో పాల్గొంటారా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ రేపు రెండు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒకటి ఇక్రిశాట్ సంస్థ స్వర్ణోత్సవాలను ప్రధాని ప్రారంభించనున్నారు. ఇక్రిశాట్ లోగోతో పాటు స్మారక స్టాంప్ ను కూడా ప్రధాని విడుదల చేయనున్నారు. దాదాపు గంటన్నర పాటు ఇక్రిశాట్ లో ప్రధాని మోదీ ఉండనున్నారు.
రెండు కార్యక్రమాల్లో....
అలాగే రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో కూడా ప్రధాని మోదీ పాల్గొంటారు. 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరిస్తారు. ఇక్కడ కూడా ప్రధాని మోదీ గంటకు పైగానే ఉండనున్నారు. ఈరెండు కార్యక్రమాలకు కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్నది అనుమానంగా ఉంది. ఇటీవల ప్రధాని మోదీపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ లో అన్యాయం జరిగిందని కేసీఆర్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మోదీ కార్యక్రమాల్లో పాల్గొంటారా? లేదా? అన్నది సందేహంగా మారింది. ఇటీవల రాజ్ భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు కూడా కేసీఆర్ దూరంగా ఉన్నారు. ప్రొటోకాల్ ప్రకారం అయితే కేసీఆర్ ప్రధాని కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది.