క్యాంప్ కార్యాలయం ఇల్లవుతుందేమో? జగన్ బాబూ బయటకు రా
ఏపీ ముఖ్యమంత్రి జగన్ దాదాపు రెండేళ్ల నుంచి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయటకు రావడం లేదు
జగన్ కు బయట జరిగేదీమీ అర్థం కావడం లేనట్లుంది. తాడేపల్లి కార్యాలయంలో కూర్చుని అంతా పచ్చగా ఉందని అనుకుంటే పొరపాటే. బటన్ నొక్కుతూ డబ్బులు పంపుతుంటే ఓట్లు పడతాయని భావిస్తున్నారేమో. అప్పుడప్పుడు బయటకు వచ్చి ఇలా చేతులూపి పోతుంటే మళ్లా 151 స్థానాలు వస్తాయిని ఆశిస్తున్నారేమో. కానీ జగన్ మీరు అనుకున్నట్లు బయట పరిస్థితి లేదు. క్షేత్రస్థాయిలో ప్రజలు కాదు మీ పార్టీ కార్యకర్తలో ఎందుకు పార్టీ కోసం పనిచేయాలిరా బాబూ అంటూ తలలు పట్టుకుంటున్నారు.
సమీక్షలతోనే కాలక్షేపం....
క్యాడర్ అసహనం, అసంతృప్తి మీ చెవికి ఎక్కే అవకాశాలు ఎంత మాత్రం లేవు. ఎందుకంటే మీరు కలిసే నేతలే తక్కువ. వారు నిజాలను నిర్భయంగా మీకు చెప్పే సాహసం చేయరు. చంద్రబాబు మాదిరిగానే మీరు కూడా అధికారులపై ఆధారపడి సంతృప్తి స్థాయి లెక్కలు వేసుకుంటూ నవ్వుకుంటూ కార్యాలయంలోనే సమీక్షలతో కాలక్షేపం చేస్తున్నారు. అనకూడదు కాని ఎప్పుడు రచ్చబండకు వస్తామన్నారు? ఎన్ని రోజులయింది?
రెండేళ్లే సమయం....
ఇక ఎన్నికలకు రెండేళ్లు మాత్రమే సమయం ఉంది. చివరి ఏడాది మీరు ఏం చెప్పినా జనం నమ్మే పరిస్థితి ఉండదు. ఏం చేసినా ఈ ఏడాదికాలంలోనే చేయాలి. మీ చేతిలో ఏమో చిల్లిగవ్వ లేకపోయే. అందుకే మీరు బయటకు రానట్లుంది. ఒకవేళ బయటకు వస్తే ఆ నియోజకవర్గాలకు వరాలు ప్రకటించాల్సి ఉంటుంది. అలా ఉత్తుత్తి ప్రకటనలు చేయడం మీకు ఇష్టం లేనట్లుంది. నిధులు లేకుండా, ఫండ్స్ విదల చేయకుండా రచ్చబండ ఎందుకుని అనుకున్నారా ఏందీ?
కరోనా తీవ్రతతో...
మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ వస్తే మరో మూడు నెలలు బయటకు రాలేరు. ప్రజల్లోకి వచ్చి పార్టీలో జోష్ నింపితేనే వచ్చే ఎన్నికల ఫలితాలపై కొంత హోప్ పెరుగుతుంది. ఎన్నికల సమయంలో వచ్చి సినిమా చూపిస్తానంటే అది ఫ్లాప్ అయినా అవ్వొచ్చు. చివరకు క్యాంప్ కార్యాలయం ఇల్లుగా మారే అవకాశం లేకపోలేదు. అతి విశ్వాసాన్ని వదిలి జనంలోకి జగన్ రావాలని పార్టీ క్యాడర్ కోరుకుంటుంది. ఇకనైనా జగన్ బాబూ బయటకు రా అని కోరుతుంది. మరి జగన్ ఎప్పుడు వస్తారు? జగన్ అనుకున్న ఎల్లోమీడియా చూపిస్తున్నవి అసత్యాలని జగన్ భావించవచ్చు. కానీ అవి అర్థ సత్యాలు అని ఆలోచించుకుంటే బయటకు వస్తారు.