పుష్ప సినిమా చూపిస్తూ కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్‌లో అరుదైన సర్జరీ
గత 16 - 17 సంవత్సరాలుగా బహ్రెయిన్‌లో పనిచేస్తున్న ప్రతీప్‌కు
బేగంపేట్‌లోని కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్‌లోని వైద్యులు ఒక రోగికి అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. రోగి మెలకువగా ఉండడానికి పాపులర్ సినిమా పుష్పను చూపించారు. రోగిని నిజామాబాద్‌కు చెందిన 30 ఏళ్ల సిబి ప్రతిప్‌గా గుర్తించారు, శస్త్రచికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు.
గత 16 - 17 సంవత్సరాలుగా బహ్రెయిన్‌లో పనిచేస్తున్న ప్రతీప్‌కు గత ఆరు నెలలుగా తరచుగా మూర్ఛలు వస్తూ ఉన్నాయి. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ హాస్పిటల్‌లో చికిత్స పొందినా అతని పరిస్థితి మెరుగుపడకపోవడంతో, తదుపరి చికిత్స కోసం అతన్ని కిమ్స్-సన్‌షైన్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఇక్కడ అతడికి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తీ చేశారు. శస్త్ర చికిత్స చేసిన న్యూరో సర్జన్ డాక్టర్ మోహన శశాంక్ హైదరాబాద్ మెయిల్ తో మాట్లాడుతూ "రోగి మెదడు నుండి కణితిని తొలగించడానికి శస్త్రచికిత్స నిర్వహించాము. మెదడులోని పలు కార్యకలాపాలకు కారణమయ్యే క్లిష్టమైన ప్రాంతంలో నుండి కణితిని తొలగించాల్సి వచ్చింది" అని చెప్పారు. రోగి మెదడు ఎడమ భాగంలో కణితి ఉందని తాము గుర్తించామని డాక్టర్ శశాంక్ మోహన్ తెలిపారు.
డాక్టర్ శశాంక్, అతని సహచరులు డాక్టర్ వేణుగోపాల్ గోకా, ఇతర నిపుణులతో కలిసి "అవేక్ క్రానియోటమీ" అని పిలిచే ఫంక్షనల్ న్యూరోసర్జరీ టెక్నిక్‌ని ఉపయోగించి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ అధునాతన ప్రక్రియలో భాగంగా మెదడులోని క్లిష్టమైన ప్రాంతాలు దెబ్బతినకుండా ఉండేలా శస్త్రచికిత్స సమయంలో రోగిని మెలకువగా ఉంచుతారు.
"శస్త్రచికిత్స సమయంలో, మేము రోగిని మెలకువగా ఉంచాము. అతనితో నిరంతరం సంభాషించాము, అతడికి పుష్ప సినిమా చూపించాము" అని డాక్టర్ శశాంక్ చెప్పారు. శస్త్రచికిత్స రెండు గంటలు పట్టింది. ఆధునిక నావిగేషన్-గైడెడ్ టెక్నాలజీని ఉపయోగించి పూర్తి చేసినట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రక్రియ చాలా సున్నితమైనది, అందుకు రోగి పూర్తి సహకారం అవసరమని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స నవంబర్ 12, 2024న నిర్వహించారు. ప్రతిప్‌ను నవంబర్ 13న పరిశీలనలో ఉంచారు. అతడిలో గణనీయమైన మెరుగుదల కనిపించిన తర్వాత, మరుసటి రోజు అతన్ని డిశ్చార్జ్ చేశారు.