వివాహ ఆహ్వానం వాట్సాప్ లో వచ్చిందా? క్లిక్ చేసే ముందు ఇది చూడండి

భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ ముఖ్యంగా అక్టోబరు నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ముహూర్తాలు ఉంటే భారీగా పెళ్లిళ్లు జరుగుతూ

Update: 2024-11-16 11:39 GMT

Wedding invitation

భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ ముఖ్యంగా అక్టోబరు నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ముహూర్తాలు ఉంటే భారీగా పెళ్లిళ్లు జరుగుతూ ఉంటాయి. ఈ ఏడాది భారత్ లో పండుగల సీజన్ ముగిసిన తర్వాత నవంబర్ 12 నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అయింది. ఈ పెళ్లిళ్ల సీజన్ 2 నెలల పాటు కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పెళ్లిల్ల హడావుడి మొదలయ్యింది. నవంబర్ డిసెంబర్ నెలలలో సుమారు 48 లక్షల పెళ్లిళ్లు జరుగనున్నాయని కంఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIF) జరిపిన ఒక అధ్యయనం లో తేలింది. ఈ సీజన్ లో మొత్తం పెళ్లిళ్లకు అయ్యే ఖర్చు సుమారు రూ 5.9 లక్షల కోట్లు గా ఉండవచ్చు అని అంచనా.

ఇక వివాహాన్ని ప్లాన్ చేయడం కూడా కాస్త కష్టమైన పని. వేదికను బుక్ చేసుకోవడం, ఆహ్వానాలు పంపడం, భోజనాలను ఏర్పాటు చేయడం, అలంకరణ వంటివి వివాహాన్ని ప్లాన్ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు. భారతదేశంలో ఆహ్వానాలు అంటే ఇళ్లకు వెళ్లడం కుటుంబాలను ఆహ్వానించడం లాంటివి ఉంటాయి. దూరంగా ఉన్న వాళ్లకు మెసేజీల ద్వారా పంపుతూ ఉంటారు. సాంకేతికత అభివృద్ధి చెందినందున స్నేహితులు, కుటుంబ సభ్యులను ఆహ్వానించడానికి Whataspp ద్వారా ఆహ్వానాలు పంపుతూ ఉంటారు.

సాంప్రదాయ ఆహ్వాన కార్డులకు బదులుగా ఆహ్వానాలను పంపడానికి ఎక్కువగా WhatsAppని ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ పెరుగుతున్న ట్రెండ్ సైబర్ నేరగాళ్ల దృష్టిని ఆకర్షించింది, కొత్త తరహా స్కామ్‌ కోసం దీనిని ఉపయోగిస్తున్నారు.

న్యూస్ 18 నివేదిక ప్రకారం, స్కామర్లు ఇప్పుడు APK ఫైల్‌ల రూపంలో WhatsApp ద్వారా వివాహ ఆహ్వానాలను పంపుతున్నారు. ఈ ఫైల్‌లను డౌన్‌లోడ్ చేస్తే వారి ఫోన్‌లు మాల్వేర్ బారిన పడతాయి, అప్పుడు సైబర్ నేరస్థుల చేతుల్లోకి ఈ పరికరాలు వెళ్లిపోతాయి. మాల్వేర్ యాక్టివేట్ అయిన తర్వాత, హ్యాకర్లు బాధితుల ఫోన్స్ నుండి సందేశాలను పంపవచ్చు, వ్యక్తిగత డేటాను తస్కరించే అవకాశం ఉంది. ఫోన్ యజమానికి తెలియకుండానే డబ్బును కూడా దొంగిలించే అవకాశం ఉంది.

అసలు ఈ స్కామ్ ఎలా చేస్తారు?

బాధితుడికి తెలియని నంబర్ నుండి వాట్సాప్ సందేశం వస్తుంది, దానికి అటాచ్‌మెంట్ గా వెడ్డింగ్ ఇన్విటేషన్ అని ఉంటుంది. ఇందులో APK ఫైల్‌స్ ఉంటాయి. వాటిని క్లిక్ చేసిన వెంటనే డౌన్‌లోడ్ అవుతుంది. ఈ APK ఫైల్‌లు UPI చెల్లింపులు, ఇమెయిల్ ఖాతాలకు పాస్‌వర్డ్‌లు మొదలైన ఫోన్‌లోని కార్యాచరణను పర్యవేక్షించగల అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్ చేయగలవు. ఇది ఫోన్ ఫంక్షన్‌లను కూడా హైజాక్ చేయగలదు. మోసపూరిత సందేశాలను పంపడానికి, డబ్బు లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంది. వారు మీ కాంటాక్ట్స్ నుండి డబ్బు వసూలు చేయడానికి ఈ సమాచారాన్ని ఉపయోగించవచ్చు.

హిమాచల్ ప్రదేశ్ పోలీసుల హెచ్చరికలు:

గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే ఇలాంటి సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హిమాచల్ ప్రదేశ్ సైబర్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. తెలియని మూలాల నుండి పంపిన ఏ ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని తెలిపారు.

సీనియర్ పోలీసు అధికారి మోహిత్ చావ్లా మాట్లాడుతూ “మీకు తెలియని నంబర్ నుండి వివాహ ఆహ్వానం లేదా ఏదైనా ఫైల్ వస్తే, దానిపై క్లిక్ చేయవద్దు. మీ ఫోన్‌లో ఏదైనా డౌన్‌లోడ్ చేయడానికి ముందు చాలా జాగ్రత్తగా నిర్ధారించుకోండి," అని తెలిపారు.

ఈ జాగ్రత్తలు ఎంతో అవసరం:

ఫోన్​కు ఏదైనా ఫైల్​ వచ్చినప్పుడు అది ఏ రకమైన ఫైల్​ అని చివరి అక్షరాలతో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు వెడ్డింగ్​ ఇన్విటేషన్‌ పేరుతో పీడీఎఫ్‌ ఫైల్‌ వస్తే 'ఇన్విటేషన్​.పీడీఎఫ్'​ అని, ఇమేజ్ ఫైల్ అయితే ఇన్విటేషన్.జెపిజి అని ఆంగ్ల అక్షరాలతో వస్తుంది. అదే ఏపీకే ఫైల్​ అయితే 'వెడ్డింగ్ ఇన్విటేషన్‌.ఏపీకే' అని ఉంటుంది. ఏపీకే అని ఉన్న వాటిని ఎట్టి పరిస్థితిలోనూ డౌన్‌లోడ్‌ చేయవద్దు.

తెలిసిన వ్యక్తుల నుంచి వచ్చిన మెసేజ్​ అయినా ఒకసారి పరిశీలించాకే దాన్ని తెరవాలి.

ఏపీకే ఫైళ్లను క్లిక్​ చేసిన సమయంలో ప్రమాదకర ఫైల్​ తెరపై కనిపిస్తుంది. వాటిని డౌన్​లోడ్​ చేయవద్దు.

ఎప్పుడైనా సైబర్ స్కామ్‌కు బలైపోతే మౌనంగా ఉండకండి. సైబర్ క్రైమ్ జాతీయ హెల్ప్‌లైన్ 1930కి డయల్ చేయడం లేదా ఫిర్యాదును నమోదు చేయడానికి https://cybercrime.gov.inలో అధికారిక ప్రభుత్వ పోర్టల్‌ని సందర్శించండి. దయచేసి జరిగిన సైబర్ మోసాన్ని నివేదించండి.

Tags:    

Similar News