కృత్రిమ మేధ, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా

అయోధ్యలో రాముని పట్టాభిషేకానికి ముహూర్తం దగ్గర పడుతోంది. భారతావని అంతా పండగ వాతావరణం నెలకొంటోంది. ఈ క్రమంలో అయోధ్యలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది. దీనికోసం వేల కొద్దీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది.;

Update: 2024-01-17 04:44 GMT
Ayodhya Ram Mandir, Uttarpradesh

Ayodhya Ram Mandir will be under CC camera and AI surveillance

  • whatsapp icon

అయోధ్యలో రాముని పట్టాభిషేకానికి ముహూర్తం దగ్గర పడుతోంది. భారతావని అంతా పండగ వాతావరణం నెలకొంటోంది. ఈ క్రమంలో అయోధ్యలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది. దీనికోసం వేల కొద్దీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. నేరగాళ్ల కదలికలను ఆ మూడో కన్ను నిరంతరం పర్యవేక్షించనుంది. సీసీ కెమెరాలకు కృత్రిమ మేధను జోడిస్తోంది. సీసీ కెమెరాలో నమోదైన వ్యక్తుల ముఖాలు ఆధారంగా అసాంఘిక వ్య(శ)క్తుల ఆట కట్టించడానికి నగర పోలీస్‌ యంత్రాంగం సిద్ధమవుతోంది.

కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) సహకారాన్ని స్టాక్యూ టెక్నాలజీస్‌ అందిస్తోంది. ‘జార్విస్‌ అనే ఆడియో, వీడియో సాఫ్ట్‌వేర్‌ ద్వారా కృత్రిమ మేధ.. జనం ముఖాలను గమనించి, మా దగ్గర ఉన్న డేటాతో స్కాన్‌ చేస్తూ ఉంటుంది’ అని స్టాక్యూ సీఈఓ అతుల్‌ రాయ్‌ చెప్పారు. ఓ ఫోటో ద్వారా ఆ వ్యక్తి నగరంలో ఎక్కడ ఉన్న క్షణాల్లో కృత్రిమ మేధ పసిగడుతుంది అని ఆయన చెప్పారు. దీని కోసం అయోధ్య నగరంలో దాదాపు 20 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ ముఖ్యమైన కూడలి సీసీ కెమెరాల నిఘాలోనే ఉంటుంది.

అయోధ్య భద్రత కోసం దాదాపు ఎనిమిది లక్షల మంది నేరగాళ్ల డాటాను సేకరించామని ఉత్తర ప్రదేశ్‌ డీజీపీ (లా అండ్‌ ఆర్డర్‌) ప్రశాంత్‌ కుమార్‌ చెప్పారు. వేలాది కెమెరాల్లో నమోదయ్యే లక్షలాది మంది ముఖాలను కృత్రిమ మేధ నిరంతరం స్కాన్‌ చేస్తుందని ఆయన వివరించారు. రోజూ దర్శనానికి వచ్చే వ్యక్తులు, గుంపులుగా వచ్చి జనం చేపట్టే కార్యక్రమాల ట్రెండ్‌ కూడా సీసీ కెమెరాలు, కృత్రిమ మేధ ఎప్పటికప్పుడు గమనిస్తాయని డీజీపీ పేర్కొన్నారు.

ఈ నెల 22న అయోధ్యలో రామునికి ప్రాణ ప్రతిష్ట జరగనున్న సంగతి తెలిసిందే. దేశ ప్రధానితో పాటు, ఆయన క్యాబినెట్‌ సహచరులు, క్రీడా, పారిశ్రామిక, వ్యాపార, సినీ ప్రముఖులు భారీ సంఖ్యలో అయోధ్యకు హాజరవుతున్నారు. వీరితో పాటు వచ్చే భక్తుల రక్షణకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.


Tags:    

Similar News