ఆమె ఏ పార్టీలో ఉన్నారు?
భాజపా ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ నేత, మాజీ మంత్రి కోడలి నాని మండి పడ్డారు.
చిన్నమ్మపై కొడాలి నాని ఫైర్
భాజపా ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ నేత, మాజీ మంత్రి కోడలి నాని మండి పడ్డారు. ఆమె ఏ పార్టీలో ఉన్నారంటూ ప్రశ్నించారు. శనివారం విడుదల చేసిన ఓ పత్రిక ప్రకటనలో ఆయన పురంధేశ్వరి తీరుపై పలు విమర్శలు చేసారు. అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ రాజకీయ కక్ష సాధింపుగా జగన్ మీద, విజయసాయిరెడ్డి మీద పెట్టిన కేసులు భవిష్యత్తులో వీగిపోతాయి, చార్జిషీట్ల నంబర్లు వేసి హడావుడి చేసినంతమాత్రాన వైకాపా నేతలు బెదిరిపోరని నాని పేర్కొన్నారు. పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? లేక తెలుగుదేశం పార్టీలో ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు.
'తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం వల్లే తాను ఇక టీడీపీలో ఉండబోనని కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారని, కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్న చంద్రబాబును పురంధేశ్వరి ఎలా సమర్ధిస్తారని' కొడాలి నిలదీశారు.
ఆమె గతంలో టీడీపీలో ఉండి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని, కాంగ్రెస్ లో ఉండి కేంద్ర మంత్రి పదవి అనుభవించి, అధికారం పోగానే వారినీ వదిలేసి బయటకు వచ్చారని కొడాలి ఆరోపించారు. ఆమె బాబు ఆదేశాల మేరకు, బాబు ప్రయోజనాల కోసమే బీజేపీలో చేరారని నాని వెల్లడించారు. పురంధేశ్వరికి రాజకీయ విలువలు లేవని ఆయన విమర్శించారు. జగన్ కేసుల్లో చార్జిషీట్లను ఇప్పుడు బీజేపీలో చేరిన పురంధేశ్వరి ప్రస్తావిస్తున్నారంటే, ఆమెకు ఉన్నది ఎవరి మీద ప్రేమ? ఎవరి మీద కోపం? అని కొడాలి ప్రశ్నించారు.