ఏపీకి ఇక అన్నీ మంచిరోజులే.. ఎప్పుడంటే?
ఒక్క ఏపీలోనే జగన్ మిత్రుడిగా బీజేపీ పెద్దలకు కన్పిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర వైఖరి మారనుంది
మార్చి పదో తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు రానున్నాయా? కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం మరింత అందుతుందా? అంటే అవుననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా సహకారం అందలేదు. పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలోనూ కేంద్ర డ్రామాలాడుతుంది. అలాగే వెనకబడిన జిల్లాలకు నిధుల విషయంలోనూ స్పందన లేదు. విభజన చట్టంలో పెట్టిన హామీల్లో ఎక్కువ శాతం అమలు కాలేదు.
ఆలోచనలో ఢిల్లీ పెద్దలు...
బీజేపీకి కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీ ఉండటంతో ఏపీ విషయంలో పెద్దగా పట్టించుకోలేదు. ఇటు అధికార వైసీపీ నుంచి కూడా పెద్దగా వత్తిడి లేదు. జగన్ ఢిల్లీ వెళ్లి వినతి పత్రాలను సమర్పించి రావడం, వాటిని కేంద్రం మూలన పడేయడం మామూలుగా మారిపోయింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఢిల్లీ పెద్దలను ఆలోచనలో పడేశాయంటున్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లో...
ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి బీజేపీకి వ్యతిరేకంగా కాలుదువ్వుతున్నారు. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు ఆయన సిద్దమయ్యారు. దక్షిణాదిలో ఇప్పటికే బలహీనంగా ఉన్న బీజేపీ ఉన్న మిత్రులను కూడా కోల్పోయే పరిస్థిితి ఏర్పడింది. బీజేపీ బలంగా ఉన్న కర్ణాటకలో కూడా బీజేపీ ఈసారి నెగ్గుకు రావడం కష్టమేనన్న అంచనాలు విన్పిస్తున్నాయి. అక్కడ ఇటీవల కాంగ్రెస్ బలోపేతమయిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
జగన్ మెచ్చే విధంగా...
ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జగన్ మిత్రుడిగా బీజేపీ పెద్దలకు కన్పిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రాకపోవచ్చన్నది సర్వేలు వెల్లడిస్తున్నాయి. యూపీ, పంజాబ్ లో బీజేపీకి అవకాశాలు లేవని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ వచ్చే అవకాశం లేకపోవచ్చు. అందుకే జగన్ ను మచ్చిక చేసుకోవడానికి ఏపీ సమస్యలపై బీజేపీ పెద్దలు ఫోకస్ పెడతారంటున్నారు. జగన్ మెచ్చే విధంగా నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వెలువడనున్నాయని ఢిల్లీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే మార్చి 10 తర్వాత ఏపీకి మంచి రోజులేనంటున్నారు.