పోలీసులపైకి నెట్టేస్తున్నారా..? ఐస్ క్రీమ్ బండి కారణమా?
నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఘటన అన్ని రాజకీయ పార్టీలకు గుణపాఠంగా చెప్పుకోవాలి
నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఘటన అన్ని రాజకీయ పార్టీలకు గుణపాఠంగా చెప్పుకోవాలి. పార్టీలతో పాటు పోలీసులు కూడా ముందు జాగ్రత్తలు తీసుకోకుంటే ఇటువంట ిఘటనలు పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయన్నది వాస్తవం. పోలీసులపైనే నెపం నెట్టేస్తే సరిపోదు. దానికి పార్టీలు కూడా సహకరించాలి. అనుమతి ఇవ్వకపోతే విమర్శలు చేయడం మామూలు. అదే ఆంక్షలు పెట్టినా పోలీసులపై విమర్శలు చేస్తారు. అదే ఘటన జరిగితే మాత్రం ఆ వైఫల్యాన్ని పోలీసులకు అంటగట్టే ప్రయత్నం చేస్తారు. దీనిని రాజకీయ పార్టీలు గుర్తొంచుకుని పోలీసులకు సహకరిస్తే ఇలాంటి ఘటనలను నివారించవచ్చని చెబుతున్నారు.
పోలీసులపై నెపం...
కందుకూరులో జరిగిన ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే దానిని పూర్తి స్థాయిలో మాత్రం అవునని చెప్పలేం. ఒక పార్టీ అధినేత తమ గ్రామానికి వస్తుంటే తమను అడ్డుకుంటారా? అని కార్యకర్తలు పోలీసులపైనే తిరగబడే అవకాశాలున్నాయి. నిర్వాహకులే ముందు జాగ్రత్తలు తీసుకుని ఇరుకు రోడ్డులో కాకుండా మైదానంలో సభను ఏర్పాటు చేసుకుంటే ఇలాంటి ఘటనలు జరగవు. చేసింది తప్పు పార్టీ నేతలయితే.. ఆ నెపాన్ని పోలీసుల వైఫల్యంగా ఎత్తి చూపడం ఏమాత్రం సరికాదు. ఎందుకంటే వచ్చే జనానికి, ఉండే పోలీసులకు మధ్య అసలు వ్యత్యాసమే ఉండదు. వేలల్లో జనాలు వస్తే.. పదుల సంఖ్యలో పోలీసులుంటారు.
అడ్డుకుంటే విమర్శలు...
వారిని అదుపు చేయడం సాధ్యం కాదు. అదుపు చేయడానికి ప్రయత్నించినా పోలీసులను విమర్శిస్తారు. ఇప్పడు కందుకూరు ఘటనలో ఎనిమిది మంది మరణించడానికి ఐస్ క్రీమ్ బండ్లు కారణమని చెబుతున్నారు. ఇరుకు రోడ్డులో ఐస్ క్రీమ్ బండ్లు పెట్టడం మూలాన వాటిపై పడి ప్రజలు తొక్కిసలాటలో మరణించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సహజంగా సమావేశాలు జరుగుతున్న సమయంలో మొబైల్ ఐస్ క్రీమ్ బండ్లు వచ్చి అక్కడ విక్రయిస్తుంటారు. ఎక్కువ స్థాయిలో బేరం జరుగుతుందని భావించి రోడ్డుపైనే ఐస్ క్రీమ్ బండ్లు పెడతారు.
పార్టీలదే బాధ్యత...
ఇప్పుడు కందుకూరులో జరిగిన ఘటనకు ఐస్ క్రీమ్ బండ్లు కారణంగా చెబుతున్నారు. ఒక్కసారి తోపులాట జరిగి ఐస్ క్రీమ్ బండి మీద పడటంతో కొందరు వాటి కింద నలిగి కొందరు చనిపోయారని చెబుతున్నారు. ఓపెన్ డ్రైనేజీ కాల్వలు కావడంతో పక్కనే ఉన్న వాటిలో పడి కొందరు మరణించారని చెబుతున్నారు. తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు, ఆరుగురు పురుషులు మరణించారు. వీరంతా ముప్పయి నుంచి యాభై సంవత్సరాల వయసు లోపు వారే కావడం గమనార్హం. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు ఎవరైనా ఇరుకు రోడ్లలో కాకుండా మైదానాలలో సభలను ఏర్పాటు చేసుకుంటే మంచిదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.