ఓలమ్మ.. నానిప్పుడేటి సేసేది..?

అయోధ్యలో సీతారాముల విగ్రహ ప్రతిష్ట ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌కు ప్రాణసంకటంగా మారింది. జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశమంతా పండుగ వాతావరణం నెలకొన్న పరిస్థితి.. విపక్షాన్ని డైలమాలో పడేస్తోంది.

Update: 2023-12-30 12:17 GMT

ప్రతిపక్షాలపై మోదీ ‘రామ’ బాణం

ఎటూ తేల్చుకోలేక పోతున్న ఇండియా బ్లాక్ 

అయోధ్యలో సీతారాముల విగ్రహ ప్రతిష్ట ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌కు ప్రాణసంకటంగా మారింది. జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశమంతా పండుగ వాతావరణం నెలకొన్న పరిస్థితి.. విపక్షాన్ని డైలమాలో పడేస్తోంది. కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఉన్ప సమయంలో, సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందు రామ మందిర నిర్మాణం పూర్తి కావడం భాజపాకు అడ్వాంటేజ్‌ కాగా, విగ్రహ ప్రతిష్టకు వెళ్లాలో, వద్దో తేల్చులేకపోవడం ప్రతిపక్షానికి తలనొప్పిగా మారుతోంది.

ఎన్నో ఏళ్ళ ప్రతిష్ఠంభన తర్వాత, కోర్టు వాయిదాల తర్వాత రామన్యాస్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో, అయోధ్యలో భారీ ఎత్తున రామమందిర నిర్మాణం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో ఆరెస్సెస్‌, భాజపా పాత్రను ఎవరూ విస్మరించలేరు. మందిర నిర్మాణానికి శంకుస్థాపన కూడా మోదీ చేతుల మీదుగా జరిగింది. ఇప్పుడు ప్రధాని చేతుల మీదుగానే ప్రతిష్ట కూడా జరుగుతోంది. సహజంగానే ఈ క్రెడిట్‌ అంతా భాజపా తన ఖాతాలో వేసుకుంటుంది. దీనివల్ల దేశవాసుల్లో, ముఖ్యంగా ఉత్తరాదిలో వచ్చే కోలాహలం.. ఓట్ల రూపంలో కమలానికి చేరుతుంది. వచ్చే ఎన్నికల్లో కూడా కేంద్రంలో భాజపా అధికారంలో వస్తుందని సర్వేలు ఇప్పటికే చెబుతున్నాయి. అయోధ్య కూడా మోదీకి మరింత పాజిటివ్‌గా మారుతుంది.

ఆలయ ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా ప్రముఖులకు ఆహ్వానాలు అందుతున్నాయి. వ్యాపార, సినీ, క్రీడా రంగాలకు చెందిన ముఖ్యులంతా 22న అయోధ్యలోనే ఉంటారు. భాజపాకు చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే కూటమిలోని పార్టీల ప్రముఖులు కూడా ఈ ఉత్సవానికి హాజరు కానున్నారు. పతిపక్ష కూటమికి ఇదే చిక్కుగా మారింది. ఆ కూటమిలోని కాంగ్రెస్‌ సహా కొన్ని పార్టీలు ఆలయ నిర్మాణానికి సుముఖంగా లేవు. అయినా భాజపా అనుకున్నట్లే జరిగింది. 22న అయోధ్యకు వెళ్లడం ద్వారా మోదీ అండ్‌ టీమ్‌ను విజయహాసాన్ని ప్రతిపక్షాలు ఫేస్‌ చేయాల్సి ఉంటుంది. ప్రత్యర్థి విజయాన్ని సాధారణంగా ఎవరూ సెలబ్రేట్‌ చేసుకోరు. అందుకే ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని మమతా బెనర్జీలాంటి నేతలు నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ శశి థరూర్‌ ’రాజకీయంగా మార్చిన కార్యక్రమానికి’ తాను వెళ్లనని ఇప్పటికే ప్రకటించారు.

సోనియా గాంధీ. మల్లిఖార్జున ఖర్గే లాంటి కాంగ్రెస్‌ నేతలకు కూడా ఆహ్వానాలు అందాయి, అటునుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్‌ లేదు. ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా వెళ్లడం లేదని తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవ్వరూ వెళ్లకపోవచ్చు. భాజపా పాలిత రాష్ట్రాలు కాకపోవడం, అయోధ్యపై ఉత్తరాదిలో ఉన్నంత సెంటిమెంట్‌ ఇక్కడ లేకపోవడం మరో కారణం. మొత్తమ్మీద మోదీ ‘రామ’ బాణానికి ప్రతిపక్షాలన్నీ మింగలేక, కక్కలేక తంటాలు పడుతున్నాయి. 

Tags:    

Similar News