ముస్తాఫా.. మనస్థాపం చెందారా?
గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ముస్తాఫా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పేశారు
గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ముస్తాఫా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పేశారు. ఆయన తన కుమార్తెను రాజకీయ అరంగేట్రం చేయించాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు బదులు తన కుమార్తె నూరి ఫాతిమాను పోటీ చేయించాలని తలపోస్తున్నారు. ముస్తాఫా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన జగన్ కు అత్యంత విధేయుడిగా వ్యవహరిస్తున్నారు. అలాంటి ముస్తాఫా ఒక్కసారిగా రాజకీయ సన్యాసం ప్రకటించడానికి కారణాలేంటన్న చర్చ జరుగుతుంది.
హ్యాట్రిక్ విజయం కొడతారని...
ముస్తాఫాకు పెద్దగా వయసేమీ మించి పోలేదు. ఆయన మరోసారి పోటీ చేసి హ్యట్రిక్ విక్టరీ కొట్టాలని ఆయన అనుచరులు ఆశతో ఎదురు చూస్తున్న వేళ ఆయన తీసుకున్న నిర్ణయం సంచలనమే అని చెప్పాలి. 2014, 2019 ఎన్నికల్లో ముస్తాఫా వైసీీపీ ఎమ్మెల్యే గా గెలిచారు. 2014లో టీడీపీ నుంచి అనేక ప్రలోభాలు వచ్చినా ఆయన వైసీపీలోనే కొనసాగారు. అందుకే ముస్తాఫా అంటే జగన్ కు ప్రత్యేక అభిమానం అంటారు. అయితే కొంత కాలం నుంచి ముస్తాఫా కొంత అసంతృప్తితో ఉన్నారు. ఆయనను జిల్లా నేతలు లెక్క చేయని పరిస్థితి. కార్పొరేషన్ లోనూ ఆయన మాట చెల్లుబాటు కావడం లేదంటారు.
మనస్థాపానికి గురయ్యారా?
పైగా జగన్ కేబినెట్ లో తనకు చోటు దక్కుతుందని ముస్తాఫా భావించారు. అయితే రెండు విడతలుగా జరిగిన విస్తరణలోనూ ఆయనకు ఛాన్స్ దక్కలేదు. కడప ఎమ్మెల్యే అంజాద్ బాషానే జగన్ తన కేబినెట్ లో కొనసాగించారు. తాను నమ్మకంగా ఉన్న జగన్ తనను పరిగణనలోకి తీసుకోకపోవడం, తొలిసారి గెలిచిన వారికి మంత్రి పదవి ఇవ్వడం కూడా ముస్తాఫాను మనస్తాపానికి గురి చేశాయంటారు. పైగా ముస్తాఫా సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు శిష్యుడు. ఆయన సలహాతోనే తాను రాజకీయంగా తప్పుకోవాలని భావించినట్లు చెబుతున్నారు.
మంత్రి పదవి కోసమేనా?
అయితే ఒక విషయం మాత్రం ముస్తాఫా మర్చిపోవద్దు. పొరుగు జిల్లాలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంల జలీల్ ఖాన్ కూడా తన కుమార్తెను రాజకీయాల్లోకి దించి ఓటమి పాలయ్యారు. జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూర్ 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆమెను ప్రజలు ఆదరించలేదు. అది గమనించుకుని నిర్ణయం తీసుకుంటే మంచిదని ముస్తాఫాకు పలువురు సన్నిహితులు సూచిస్తున్నారు. ముస్లిం మహిళ ఎమ్మెల్యేగా ఎన్నికయితే ఖచ్చితంగా కేబినెట్ పదవి లభిస్తుందన్న భావనతో వీళ్లు తాము తప్పుకుని పోటీకి దింపుతున్నారన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. మరి ముస్తాఫా మనస్తాపం చెంది పోటీ నుంచి తప్పుకున్నారా? తన కుటుంబంలో మంత్రి పదవి దక్కాలని ఆశించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా? అన్నది చూడాల్సి ఉండి.