AP Formation Day Special Story: శాపగ్రస్త ఆంధ్రప్రదేశ్‌..!

సుదీర్ఘ సముద్ర తీరం.. ప్రతీ నూట యాభై కిలోమీటర్లకు ఓ నగరం.. కష్టపడి పని చేసే జనం.. సమర్థమైన మానవ వనరుల సముదాయం.. ఇదీ ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేకతలు. కానీ ప్రాంతీయ, కుల, కక్షాపూరిత రాజకీయాల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్ర... ఇతర రాష్ట్రాల దృష్టిలో చులకన అయిపోతోంది.

Update: 2023-11-01 02:04 GMT

రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ 

కుల, కక్ష రాజకీయాలకు చిరునామా 

సుదీర్ఘ సముద్ర తీరం.. ప్రతీ నూట యాభై కిలోమీటర్లకు ఓ నగరం.. కష్టపడి పని చేసే జనం.. సమర్థమైన మానవ వనరుల సముదాయం.. ఇవీ ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేకతలు. కానీ ప్రాంతీయ, కుల, కక్షాపూరిత రాజకీయాల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్ర... అభివృద్ధిని ఫణంగా పెడుతోంది,ఇతర రాష్ట్రాల దృష్టిలో పలుచన అయిపోతోంది. తిలా పాపం, తలా పిడెకడు అన్నట్లు.. ఆంధ్ర ప్రదేశ్‌ నేటి అయోమయ స్థితికి అన్ని రాజకీయ పక్షాలూ బాధ్యత వహించాల్సిందే!  ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రస్తుత ఏపీ గమనంపై ‘తెలుగు పోస్ట్‌’ స్పెషల్‌ స్టోరీ.

1956 నవంబర్‌ ఒకటిన అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిరది. తమిళవాళ్ల డామినేషన్‌ తట్టుకోలేని ఆంధ్రుల ఆందోళన.. పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ.. తొలి ఎస్సార్సీ (స్టేట్‌ రీఆర్గనైజేషన్‌ కమిటీ) ఏర్టాటు... భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఎస్సార్సీ నిర్ణయం.. లాంటి పరిణామాల మధ్య తెలుగు మాట్లాడే ప్రాంతాలతో 2014 జూన్‌ 2కి ముందున్న (అవిభాజ్య) ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పడింది . అయినా 1969లో ప్రత్యేక తెలంగాణ, డెబ్బయ్‌ తొలినాళ్లలో జై ఆంధ్ర ఉద్యమాలు తలెత్తాయి. ఎన్టీరామారావు రాజకీయ ప్రవేశంతో ఆంధ్రుల ఆత్మగౌరవం అనే నినాదం అవిభాజ్య రాష్ట్రాన్ని కొన్నాళ్లు ఏకతాటిపైకి తీసుకువచ్చింది. 2000 తొలినాళ్లలో కెసిఆర్  ఆధ్వర్యంలో మొదలైన మలివిడత తెలంగాణ ఉద్యమం... 2014 నాటికి సంపూర్ణమై... నేటి అవశేష ఆంధ్రప్రదేశ్‌ను మిగిల్చింది.

సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో నిధులు, నీళ్లు, ఉద్యోగాలు కోల్పోయామని తెలంగాణవాదులు ఆందోళన చేస్తే... రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ లాంటి మహానగరాన్ని కోల్పోయామని ఇప్పటికీ ఆంధ్రులు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రజల మధ్య విభేదాలు లేవు కానీ, హరీష్‌రావు లాంటి వాళ్లు తమ రాష్ట్రంతో పోల్చి ఆంధ్రను తక్కువ చేసి మాట్లాడుతూ... మానుతున్న గాయాన్ని మళ్లీ కెలుకుతూ ఉంటారు. ఎలాంటి సరైన విధి విధానాలు లేకుండా, గాభరగా రాష్ట్రాన్ని విభజించి పాపం మూటగట్టుకుంది కాంగ్రెస్‌. ఆ ఫలితంగా ఏపీలో నామరూపాలు లేకుండా పోయింది. సమీప భవిష్యత్తులో కూడా అధికారాన్ని దక్కించుకునే అవకాశం కాంగ్రెస్‌కు ఇక్కడ లేదు. ఆదరాబాదరా ‘విభజన’ బిల్లుకు బేషరతు మద్దతు ప్రకటించి భాజపా.. ఏపీకి అన్యాయం చేసే విషయంలో ‘నేనేం తక్కువ తినలేదు’ అని నిరూపించుకుంది.

2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడు కావాలనుకుని... జనం అతనికి పట్టం కట్టారు. మోదీ హవా, పవన్‌ సినీ గ్లామర్‌ కూడా చంద్రబాబు విజయానికి తోడయ్యాయి. పదేళ్ల పాటు హైదరాబాద్‌ నుంచే పరిపాలించే అవకాశం ఉన్నా.. చంద్రబాబు అర్థంతరంగా మూటాముళ్లూ సర్దుకుని విజయవాడకు వచ్చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి దొరికిపోవడంతో చంద్రబాబు తోకముడిచారని నాటి తెరాస, వైసీపీ నేతలు ఆరోపించారు. కారణమేదైనా పదేళ్ళ పాటు హక్కు ఉన్న హైదరాబాద్‌ను అర్థంతరంగా వదలి రావడం అవశేష ఆంధ్రకు తగిలిన మరో దెబ్బ.

ఏపీలో కాపురం పెట్టిన చంద్రబాబు మహా నగరాన్ని నిర్మిస్తానంటూ ప్రణాళికలు మొదలు పెట్టారు. మూడు పంటలు పండే చోట నగరాల నిర్మాణం మంచిది కాదని పర్యావరణ ప్రేమికులు హెచ్చరించారు. రాష్ట్రం మధ్యలో రాజధాని ఉండాలంటూ ఆయన అమరావతిని ఎంచుకున్నారు. ముప్పయ్‌ వేల ఎకరాలను సమీకరించారు. తాత్కాలిక భవనాలంటూ అసెంబ్లీ, సచివాలయాల నిర్మాణాలకు వేల కోట్ల రూపాయలు.. ఐకానిక్‌ భవనాలు, బాహుబలి డిజైన్‌లంటూ మూడేళ్ల కాలాన్ని... నాటి తెలుగుదేశం ప్రభుత్వం వృథా చేసింది. ఇలా కొత్త రాష్ట్రానికి కీలకమైన ఐదేళ్లు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి.

ఇంత ఆర్భాటం లేకుండా... విజయవాడనే రాజధానిగా ప్రకటించి, ఓ వేయి ఎకరాలలో ప్రభుత్వ కార్యాలయాలను, అసెంబ్లీ, సెక్రటేరియట్‌లను నిర్మించి ఉంటే... కాలక్రమంలో బెజవాడే పెద్ద రాజధానిగా మారి ఉండేది. కానీ రాత్రికి రాత్రి హైదరాబాద్‌ లాంటి నగరాన్ని నిర్మించాలనుకునే చంద్రబాబు అత్యాశ ఆంధ్రుల పాలిట శాపంగా మారింది. ఇక వైకాపా ఆరోపించినట్లు అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్  అసైన్డ్‌ భూముల కుంభకోణం... ఇవి మహా నగర నిర్మాణాన్ని మరింత సంక్లిష్టం చేశాయి.

2019లో జగన్‌ సర్కార్‌ వచ్చిన తర్వాత అమరావతి కాన్సెప్ట్‌ మూలన పడిరది. మూడు రాజధానుల నిర్మాణం తెరపైకి వచ్చింది. పేరుకు మూడు రాజధానులే కానీ, జగన్‌ దృష్టి అంతా విశాఖపట్నం మీదే ఉంది. ఏపీలో ఇప్పటికే విశాఖ అభివృద్ధి చెందిన నగరం కాబట్టి పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టనక్కర్లేదనే జగన్‌ వాదనలో నిజం ఉంది. కానీ అమరావతి అభివృద్ధి చెందితే పెత్తనమంతా ఓ సామాజిక వర్గం చేతుల్లోకి వెళ్లిపోతుందని నేటి ప్రభుత్వ పెద్దల భయం. అందుకే ‘అమరావతి’ని మొగ్గలోనే తుంచే కార్యక్రమం మొదలైంది. విశాఖ పట్నాన్నే రాజధాని చేస్తే, అమరావతి పరిస్థితేంటి? సమీకరించిన భూమి సంగతేంటి? భూములిచ్చిన రైతులకు న్యాయం ఎలా చేస్తారు లాంటి వన్నీ జవాబుల్లేని ప్రశ్నలు. వీటికి 2024 ఎన్నికలు, తర్వాత వచ్చే సర్కారు, సుప్రీం కోర్టే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.

ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏదో తెలియని రాష్ట్రంగానే కొనసాగుతోంది. ఐదు పదేళ్లలో రాజధానుల నిర్మాణం సాధ్యం కాదు. అదే సమయంలో ఆచరణ సాధ్యం కాని ప్రణాళికలతో, గాలిలో మేడలు కట్టి ప్రజలను భ్రమలలో ఉంచడం మంచిది కాదు. ఆంధ్రుల ఖర్మ ఏంటంటే.. అధికార, ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర అభివృద్ధి కంటే రాజకీయాలకే ప్రాధాన్యం ఇవ్వడం. జగన్‌ను అవినీతి పరుడిగా చిత్రించడం, చంద్రబాబు అరెస్ట్‌... ఇవన్నీ ‘అ‘రాచకీయాల’లో భాగమే. హైదరాబాద్‌లో నివసించే ప్రతిపక్షాలు, పవన్‌ లాంటి నేతలు, మీడియా... ఇవి కూడా ఆంధ్రలో పెత్తనం చలాయించాలనుకోవడం ఏపీకి దాపురించిన మరో దురదృష్టం. అక్కడ ఎక్స్‌ట్రాలు చేస్తే.. కెసిఆర్  ముడ్డి మీద తన్ని పంపిస్తాడు. అందుకే హైదరాబాద్‌లో ఉండి ఏపీలో రాజకీయాలు చేయాలనుకుంటున్నారు ఈ గొప్పోళ్లంతా.

అరవై ఏడేళ్ల తర్వాత దిగజారిన రాజకీయాలతో, రాజధాని స్పష్టంగా తెలియని రాష్ట్రంగా, సరైన ఉపాధి అవకాశాలు లేని ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్‌ మిగిలిపోయింది. ఇప్పుడు ఏపీకి కావాల్సింది తమ రాజకీయ భవిష్యత్తు, తమ సామాజిక వర్గ అభివృద్ధిపై విజన్‌ ఉన్న నేతలు కాదు. ఈ ప్రాంతంపై, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై అభిమానం ఉన్న నాయకులు. 

Tags:    

Similar News