రోడ్ షో రద్దు జీవో తొలిసారి కుప్పంలోనే అమలు?
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపటి కుప్పం నియోజకవర్గం పర్యటనపై సందేహాలు నెలకొన్నాయి
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపటి కుప్పం నియోజకవర్గం పర్యటనపై సందేహాలు నెలకొన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం కుప్పం పర్యటనలో వ్యవహరించాలని ఇప్పటికే పోలీసు అధికారులు స్థానిక టీడీపీ నేతలకు సూచించినట్లు తెలిసింది. ఎలాంటి రోడ్ షోలకు, రోడ్లపై సమావేశాలు, సభలకు అనుమతి లేదని పలమనేరు డీఎస్పీ ఇప్పటికే పార్టీ నాయకులకు తెలిపినట్లు సమాచారం.
రేపటి నుంచి మూడు రోజులు....
రేపటి నుంచి చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించాలని నిర్ణయించారు. ఈ మేరకు కుప్పం స్థానిక నేతలకు సమాచారం ఇచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయం సూచించిన మేరకు కుప్పం నియోజకవర్గంలో ఎక్కడ సమావేశాలు ఏర్పాటు చేయాల్సింది? రూట్ మ్యాప్ ను కూడా రూపొందించారు. ఇందుకు పోలీసుల అనుమతిని స్థానిక టీడీపీ నేతలను కోరారు.
బహిరంగ సభలకే....
అయితే తాజాగా ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు రోడ్లపై ఎలాంటి సమావేశాలకు అనుమతి లేదు. రోడ్ షోలపై నిషేధం విధిస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను తొలిసారి కుప్పంలోనే అమలు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. కుప్పం పర్యటనలో చంద్రబాబు బహిరంగ సభలను పెట్టుకోవచ్చని, అంతే తప్ప రోడ్ షోలకు అనుమతి లేదని పలమనేరు డీఎస్పీ టీడీపీ నేతల ఎదుట అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై టీడీపీ హైకోర్టును ఆశ్రయించే అవకాశముంది. రేపు చంద్రబాబు కుప్పం పర్యటన ఉంటుందా? లేదా? అన్నది సందేహంగా మారనుంది.