షిండే క్యాంప్ లో ఛేంజ్ కనిపిస్తుందా?
మహారాష్ట్ర సంక్షోభానికి ఎండ్ కార్డు పడే అవకాశాలు లేవు.. క్యాంప్ లో ఉన్న ఎమ్మెల్యేల ఆలోచనల్లో మార్పు కన్పిస్తుంది
తీపిని తినే కొద్దీ చేదు అనేది సామెత. అలాగే ఏ విషయాన్ని అయినా నానుస్తూ పోనిస్తే అసలుకే ఎసరు కలిగే అవకాశాలున్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర సంక్షోభంలోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న మహారాష‌్ట్ర సంక్షోభానికి ఇప్పుడిప్పుడే ఎండ్ కార్డు పడే అవకాశాలు కన్పించడం లేదు. గౌహతి క్యాంప్ లోనే ఇంకా అసంతృప్త ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారు. అయితే సమయం గడిచే కొద్దీ అసంతృప్త ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడే అవకాశాలు కన్పిస్తున్నాయి.
కొందరు ఎమ్మెల్యేలు...
ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండే నిర్ణయాలతో ఏకీభవించడం లేదని సమాచారం. బీజేపీలో విలీనం అయ్యేందుకు కొందరు ఎమ్మెల్యేలు ఇష్టపడటం లేదని తెలిసింది. బీజేపీతో విలీనం చేయాలని భావిస్తే తాము తిరిగి శివసేన గూటికి వెళ్లిపోతామని కొందరు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఎక్కువ మంది మాత్రం బీజేపీలో విలీనం కావాలని కోరుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీలో చేరడమే మంచిదన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వ్యక్తమవుతుంది.
సమయం గడిచే కొద్దీ....
ఇలా సమయం గడిచే కొద్దీ ఎమ్మెల్యేల ఆలోచనల్లో మార్పు వస్తున్నట్లు చెబుతున్నారు. ఉద్ధవ్ థాక్రే సతీమణి రేష్మి థాక్రే సయితం కొందరు అసంతృప్త ఎమ్మెల్యేలతో మాట్లాడగా వారు కొంత మెత్తబడినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరగా గవర్నర్ జోక్యం చేసుకుని అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించి తమను ముంబయికి వచ్చేలా చూడాలని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేల ఇళ్లపై శివసేన కార్యకర్తలు దాడి చేస్తుండటంపై కూడా ఆందోళన చెందుతున్నారు.
ఎమ్మెల్యేల్ల ఛేంజ్...
సమయం గడిచే కొద్దీ షిండే క్యాంప్ లోనూ ఛేంజ్ వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరో వైపు సుప్రీంకోర్టులో షిండే వర్గానికి కొంత ఊరట లభించింది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు కొంత గడువు దొరికింది. అయినా సయమం గడిచే కొద్దీ షిండే క్యాంప్ నుంచి ఎమ్మెల్యేలు జారుకుంటారన్న వార్తలు వినవస్తున్నాయి. ఉద్ధవ్ కూడా కాలయాపన చేయాలని చూస్తున్నారు. అదే జరిగితే కొందరు ఎమ్మెల్యేలు తిరిగి శివసేన పంచన చేరే అవకాశాలు లేకపోలేదు.