జగన్ గ్రాఫ్ నిజంగా పడిపోయిందా.. ?
జగన్ అధికారంలోకి వచ్చి సుమారు మూడేళ్లు కావస్తుంది. మూడేళ్ల పాటు జగన్ సంక్షేమ కార్యక్రమాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు.
జగన్ అధికారంలోకి వచ్చి సుమారు మూడేళ్లు కావస్తుంది. మూడేళ్ల పాటు జగన్ సంక్షేమ కార్యక్రమాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. కరోనా వైరస్ వల్ల కూడా ఇతర అంశాలపై దృష్టి పెట్టకపోవడానికి ఒక కారణం కావచ్చు. కానీ ఏపీలో అభివృద్ధి అనేది లేదన్నది అందరూ అంగీకరించే సత్యం. అయినా జగన్ చరిష్మా ఏమాత్రం తగ్గ లేదని వరస ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. అంటే ప్రజలు జగన్ వైపే ఉన్నారని ఎన్నికల రిజల్ట్ చెబుతున్నాయి.
బాబుది అదే అభిప్రాయం...
కానీ విపక్షాలు మాత్రం జగన్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందనే అభిప్రాయంలో ఉన్నాయి. ముఖ్యంగా విపక్ష నేత చంద్రబాబు జగన్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఏ ఎన్నికలు జరిగినా అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయని, అది చూసి కంగారు పడాల్సిన అవసరం లేదని, క్షేత్రస్థాయిలో జనం జగన్ పాలన పట్ల వ్యతిరేకతతో ఉన్నారని సీనియర్ నేతలకు చంద్రబాబు చెబుతూ వస్తున్నారు.
షాకు ఇచ్చిన నివేదిక కూడా....
ఇక భారతీయ జనా పార్టీ అదే అభిప్రాయంలో ఉంది. రాజధాని అమరావతి దగ్గర నుంచి ఎయిడెడ్ స్కూళ్ల వరకూ జగన్ తీసుకున్న నిర్ణయాలతో ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమయిందని అభిప్రాయపడుతోంది. అమిత్ షాకు కూడా బీజేపీ రాష్ట్ర నేతలు అదే నివేదిక ఇచ్చారు. ప్రధానంగా మధ్యతరగతి, ఉన్నత, ఉద్యోగ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఇప్పటికే ఉందని అన్ని పార్టీలూ అభిప్రాయపడుతున్నాయి. క్షేత్రస్థాయిలో వారికి అందిన సమాచారం మేరకు జగన్ గ్రాఫ్ తగ్గినట్లే భావిస్తున్నారు.
కంటితో చూసి నిర్ణయాలు తీసుకుంటేనే?
మరోవైపు పదవుల పంపకాలు, సంక్షేమ పథకాలతో జగన్ గ్రాఫ్ ఏమాత్రం తగ్గలేదని వైసీపీ నేతలు పైకి చెబుతున్నా లోపల మాత్రం బింకంగానే ఉన్నారు. ఇసుక, మద్యం వంటివి వచ్చే ఎన్నికల్లో పార్టీని ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయని వైసీపీ నేతలే అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. జగన్ కు తెలియకుండానే తప్పులు జరుగుతున్నాయి. అందుకే జగన్ కంటితో చూసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో మాదిరి అయితే జగన్ గ్రాఫ్ ప్రస్తుతం లేదనే చెప్పుకోవాలి. అయితే ఎంత మేర తగ్గింది? ఆ మేరకు విపక్షాలకు ప్లస్ అవుతుందా? అంటే అది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి.