ఆయువుపట్టులో ఎవరి బలం ఎంత?
వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా గెలవాలని వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు
వైఎస్ జగన్ మరో ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఆయన తన సంక్షేమ పథకాలే తనను వచ్చే ఎన్నికల్లో గట్టెక్కిస్తాయని నమ్ముతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తి తమకు అనుకూలంగా మారుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విశ్వసిస్తున్నారు. ఇలా ఎవరికి వారే ప్రజల నుంచి తమకు మద్దతు లభిస్తుందని, అధికారం తమదేనని గట్టిగా భావిస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో గెలిచి తీరాల్సిందేనని జగన్ అంటుంటే.. 175 కాదు కదా.. పులివెందులలో కూడా వైసీపీ గెలవలేని పరిస్థితులు నెలకొన్నాయని చంద్రబాబు గట్టిగా చెబుతున్నారు.
కర్నూలు స్పందన...
చంద్రబాబు ఇటీవల కర్నూలు జిల్లాలో చేసిన పర్యటన ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పొచ్చు. కర్నూలు జిల్లాలోని కోడుమూరు, ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో జనం విపరీతంగా రావడంతో ఆయన ఈసారి గెలుపు గ్యారంటీ అన్న ధీమాలో ఉన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని చంద్రబాబు భావిస్తున్నారు. జగన్ కు ఆయువుపట్టుగా ఉన్న ప్రాంతంలో తనకు లభించిన ఆదరణ తనకు ఈసారి అందలం ఎక్కిస్తుందని చంద్రబాబు నమ్ముతున్నారు. మదనపల్లెలో జరిగిన మినీ మహానాడు కూడా పూర్తిగా విజయవంతం అయిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
సీమ గడ్డపైనే ఆ పదాన్ని...
రాయలసీమ ప్రాంతంలో జగన్ కు కొంత పట్టు ఎక్కువ. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో అత్యధిక స్థానాలను సాధించేందుకు జగన్ కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో 52 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే గత ఎన్నికల్లో 49 స్థానాలు దక్కాయి. మిగిలిన కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 102 సీట్లు లభించాయి. జగన్ ను రాయలసీమలోనే దెబ్బ కొట్టాలన్న ఉద్దేశ్యం చంద్రబాబులో కనిపిస్తుంది. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఇక్కడ కేవలం మూడు సీట్లు మాత్రమే దక్కడంతో ఈసారి ఆ సీన్ ఉండదన్నది ఆయన బలమైన నమ్మకం. అందుకే ఈసారి అధికారం తనదేనన్న ఆలోచనలో చంద్రబాబు అన్నారు. లాస్ట్ ఛాన్స్ పద ప్రయోగం కూడా సీమ గడ్డపైనే పెద్దాయన చేశారంటారు. చంద్రబాబు కర్నూలు పర్యటనకు కౌంటర్ గా వైసీపీ కర్నూలులో మూడు రాజధానులకు అనుకూలంగా బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. వచ్చే నెల ఐదో తేదీన ఈ సభ జరగనుంది.
కోస్తాంధ్రపై జగన్...
మిగిలిన ప్రాంతాల్లో జగన్ ను ఎదుర్కొనడం పెద్ద కష్టమేమీ కాదన్న భావన చంద్రబాబులో ఉంది. కడప జిల్లాలో కొంత అటు ఇటుగా ఉన్నా మిగిలిన మూడు జిల్లాల్లో కనీసం పాతిక స్థానాలను దక్కించుకుంటే అధికారంలోకి వచ్చినట్లేనని చంద్రబాబు ఆ ప్రాంత నేతలతో అన్నట్లు తెలిసింది. జగన్ కూడా తక్కువేమీ కాదు. గతంలో మాదిరి కేవలం సీమ ప్రాంతంపైనే ఆధారపడలేదు. తనకు అత్యధిక స్థానాలను కట్టబెట్టిన సీమ ప్రాంతంతో పాటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రపై కూడా దృష్టి పెట్టారు. కోస్తాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో చంద్రబాబును దెబ్బతీయగలిగితే మరొకసారి తనకు అధికారం దక్కినట్లేనన్నది జగన్ లెక్క.
అక్కడ పట్టు కోసం...
అందుకే ఆ ప్రాంతాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారంటున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనతో పాటు, జిల్లాల పెంపు, గ్రామీణ ప్రాంతాలపై పట్టు సాధించడం కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వరసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఎన్నికల సమయానికి తనకంటూ ప్రత్యేక ఓటు బ్యాంకును మరింత బలోపేతం చేసుకోవాలన్న లక్ష్యంతో ఆయన జిల్లాల పర్యటన కూడా చేస్తున్నారు. దీంతో చంద్రబాబు రాయలసీమ, జగన్ ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర పై ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనపడుతుంది. మొత్తం మీద ప్రాంతాల వారీగా లెక్కలు వేసుకుని మరీ ప్రత్యర్థుల ఆయువుపట్టుగా భావించే ప్రాంతాలపై దెబ్బకొట్టాలన్నది ఇద్దరి వ్యూహంగా కనిపిస్తుంది. మరి చివరకు ఎవరిది గెలుపు అన్నది చూడాల్సి ఉంది.