జగన్ అంచనా అదేనట.. వారిద్దరూ కలిసినా?

వైసీపీ అధినేత జగన్ ఏదీ అంత ఆషామాషీగా నిర్ణయం తీసుకోరు. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకునే ఆయన నిర్ణయం ఉంటుంది.

Update: 2022-10-31 04:10 GMT

వైసీపీ అధినేత జగన్ ఏదీ అంత ఆషామాషీగా నిర్ణయం తీసుకోరు. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకునే ఆయన నిర్ణయం ఉంటుంది. ఆయన నేరుగా విమర్శలు చేశారంటే అందుకు ఒక అర్థముందని చెబుతున్నారు. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేయడం వెనక కూడా ఒక వ్యూహం దాగి ఉందని చెబుతున్నారు. టీడీపీ, జనసేన కలిస్తే తమకే మంచిదన్న ఆలోచనలో జగన్ ఉన్నారట. అందువల్ల రాజకీయ ప్రయోజనాలతో పాటు మరికొన్ని అడ్వాంటేజీలు తమకు వస్తాయని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

టార్గెట్ పవన్...
అందుకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను వరసగా టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ నేతలు మాటలతో రెచ్చగొడుతున్నారు. విశాఖ వంటి సంఘటనలు కూడా తమకు కలసి వస్తాయని భావిస్తున్నారు. టీడీపీతో పవన్ కలిసినా బీజేపీ ఎట్టి పరిస్థిితుల్లో కలవదు. అది ఒంటరిగానైనా పోటీ చేస్తుంది తప్ప తెలుగుదేశం పార్టీతో కలవదు. చంద్రబాబు ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ తోనైనా కలిసే అవకాశముంది తప్పించి జగన్ ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్ తో చేయి కలపరు. అది తెలిసిన బీజేపీ జగన్ కే మద్దతుగా ఉంటుందన్న అంచనా వేస్తున్నారు. బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకోకపోయినా పరోక్షంగా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది కాబట్టి కొన్ని ప్రయోజనాలను ఎన్నికల సమయంలో పొందే వీలుంది.
కాపు సామాజికవర్గంలోనూ...
ఇక కాపుల్లోనూ పవన్ కల్యాణ్ కు అంత సానుకూలత లేదు. గంపగుత్తగా ఆ సామాజికవర్గం ఓట్లన్నీ పవన్ కు పడవు. టీడీపీతో కలిస్తే మెజారిటీ కాపు ఓటర్లు తమ వైపు చూసే అవకాశం ఉందన్న అంచనాలో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబును చేసేందుకు మద్దతిచ్చినంత మాత్రాన కాపులు పవన్ వెంట నడవరన్నది ఆయన ఆలోచన. అందుకే పవన్ ఎంత త్వరగా చంద్రబాబుతో కలసి రాష్ట్రమంతటా పర్యటిస్తే అంత మంచిదని జగన్ భావిస్తున్నారు. కాపుల్లో ఎక్కువ శాతం తనవైపు చూసే అవకాశం ఉందన్నది ఆయన ఆలోచన. ఆ రెండు సామాజికవర్గాలకు ఆంధ్రప్రదేశ్ లో బద్ధ విరోధం ఉంది కాబట్టి తనకు అడ్వాంటేజీగా మారుతుందని జగన్ ఆశిస్తున్నారు.
బీసీ ఓటర్లు...
మరో కీలకమైన అంశం. బీసీ ఓటర్లు. ఏపీలో అత్యధికంగా బీసీ ఓటర్లున్నారు. పవన్ కల్యాణ్ టీడీపీకి మద్దతు ప్రకటిస్తే బీసీలు ఆటోమేటిక్ గా తమకు అనుకూలంగా మారతారని జగన్ అంచనా వేస్తున్నారు. కాపులకు వ్యతిరేకంగా బీసీలు పనిచేస్తారని పసిగట్టిన జగన్ తొలి నుంచి వారిని మంచి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లోనే బీసీలు కొంత వైసీపీ వైపు మొగ్గు చూపారు. ఈసారి చంద్రబాబు, పవన్ కలిస్తే 80 శాతానికి పైగానే బీసీ ఓటర్లు వైసీపీకి టర్న్ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. అందుకే పవన్ చంద్రబాబు కలవాలని జగన్ బలంగా కోరుకుంటున్నారు. ఇటు బీసీలు, అటు కాపుల్లో కొంత శాతం తనకు అనుకూలంగా మారితే మరోసారి విజయం తనదేనన్న విశ్వాసంతో జగన్ ఉన్నారు. అందుకే పవన్ ను రెచ్చగొట్టి త్వరగా టీడీపీతో కలిసేలా వైసీపీ అధినేత పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News