షర్మిల ఫైనల్ డెసిషన్... వచ్చే ఎన్నికల్లో...?

వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి దాదాపు ఎనిమిది నెలలకు పైగానే అవుతుంది. కానీ ఇప్పటి వరకూ ఆమెకు ఒక క్లారిటీ ఉన్నట్లు కనపడటం లేదు

Update: 2022-02-08 02:27 GMT

వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి దాదాపు ఎనిమిది నెలలకు పైగానే అవుతుంది. కానీ ఇప్పటి వరకూ ఆమెకు ఒక క్లారిటీ ఉన్నట్లు కనపడటం లేదు. ఏ వర్గాన్ని దగ్గరకు తీసుకుందామన్న ఆలోచన షర్మిలలో కన్పించడం లేదు. పైగా అన్న జగన్ తో వైరం కూడా రాజకీయంగా ఆమెకు ఇబ్బంది కల్గించే అంశమనే చెప్పాలి. ఇప్పటికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని, జగన్ ను అభిమానించే వారు అనేక మంది ఉన్నారు. వారిని కలుపుకుని పోయే ప్రయత్నం కూడా చేయలేదు.

చేరికలు లేక....
కేవలం తన వాగ్దాటితోనూ, వైఎస్ పై అభిమానంతోనూ ఓట్లు వచ్చి పడతాయని ఆమె ఆశిస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు జరగడం లేదు. పోనీ పోలోమంటూ ఎవరైనా వచ్చి పార్టీలో చేరతారా? అంటే అదీ జరగడం లేదు. పైగా సోదరుడు జగన్ తో విభేదాలు పార్టీని మరింత బలహీన పర్చాయనే చెప్పాలి. ఎందుకంటే జగన్ సహకారం ఉంటే పార్టీ లో చేరికలు బాగానే ఉండేవి.
జగన్ తో విభేదాలు...
దీనికి ఒక ఉదాహరణ ఇటీవల మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏపీకి వెళ్లి జగన్ ను కలిశారు. ఆయన టీఆర్ఎస్ నుంచి బయటకు రావాలనుకున్నారు. కానీ జగన్ చెప్పిన సలహా ఏంటంటే టీఆర్ఎస్ లోనే కొనసాగమని. తర్వాత ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్నది వేరే విషయం. జగన్ నేరుగా చెప్పకపోయినా ఆయనను అభిమానించే నేతలు షర్మిల వద్దకు వెళ్లాలన్నా వెనకడుగు వేస్తున్నారు. దీంతో పార్టీలో జోష్ లేదు. చేరికలు లేవు. ఒన్ ఉమెన్ షో గానే రన్ అవుతుంది.
పోటీ చేయకపోవడమే.....
ఇక సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన వైఎస్ షర్మిల స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఉందని వాయిదా వేశారు. తిరిగి ఎప్పుడు ప్రారంభించాలన్నది ఆమెకే తెలియని పరిస్థితి ఉంది. ఏ నియోజకవర్గంలోనూ వైఎస్సార్టీపీకి బలమైన నేతలు కన్పించడం లేదు. ఈ పరిస్థితుల్లో అసలు వచ్చే ఎన్నికలకు వెళ్లాలా? వద్దా? అన్న ఆలోచనలో కూడా షర్మిల ఉన్నట్లు తెలిసింది. తెలంగాణలో ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. ఈ తక్కువ సమయంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయగలమా? లేదా? అన్న దానిపై షర్మిల సన్నిహితులు, ముఖ్యులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఎన్నికల బరిలోకి దిగి పేరుకు పేరు... డబ్బుకు డబ్బు పోగొట్టుకోవడం ఎందుకన్న ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు.


Tags:    

Similar News