సర్వేలో పేరు కనిపిస్తేనే టిక్కెట్లు
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. ఆయన వైఎస్సార్సీపీ శాసనసభ పక్ష సమావేశంలో మాట్లాడారు. సర్వే ప్రకారమే టిక్కెట్ల కేటాయింపు జరుగుతుందని జగన్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల పనితీరు బాగా లేకపోతే ఖచ్చితంగా పక్కన పెడతామని, గెలుపు ముఖ్యమని జగన్ చెప్పారు. మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తామని చెప్పారు. సర్వేలో పేర్లు రాకపోతే ఖచ్చితంగా మార్పులు వస్తాయని జగన్ చెప్పారు. రాబోయే రోజుల్లో వైసీపీ పై మరింత బురద జల్లుతారని, ఏమీ లేకపోయినా ఏదో జరుగుతుందన్న భ్రమలను కల్పిస్తారని జగన్ అభిప్రాయపడ్డారు.
ఇంటింటికి తిరిగి...
ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని జగన్ చెపపారు. మరో రెండు నెలల్లో మూడేళ్ల పాలన పూర్తి చేసుకోబోతున్నామని పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. రాబోయే రెండేళ్లు ఎంతో కీలకమని జగన్ వ్యాఖ్యానించారు. మరోసారి ఒంటరిగా పోటీ చేసి ప్రజల మనసులను గెలుచుకునే ప్రయత్నం చేయాలని జగన్ అన్నారు. ఇందుకు ఎమ్మెల్యేల పనితీరే ఆధారపడి ఉంటుందని చెప్పారు.
ప్రజల వద్దకే....
ఈ రెండేళ్లు ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్లి వాళ్ల సమస్యలను పరిష‌్కరించేందుకు పనిచేయాలని జగన్ పిలుపు నిచ్చారు. కనీసం ఇంటింటికి మూడు సార్లు తిరగాలన్నారు. ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించాలని జగన్ ఎమ్మెల్యేలను కోరారు. అలా లేకపోతే ఎంత మంచి చేసినా గెలవడం కష్టమేనని అన్నారు. మే నెలలో పది గ్రామ సచివాలయాలను సందర్శించాలని జగన్ టార్గెట్ విధించారు. మరోసారి నియోజకవర్గంలో బూత్ కమిటీల ఏర్పాటు చేయాలని, ఇందులో మహిళలు ఎక్కువగా ఉండేలా చూడాలని జగన్ కోరారు.