చిరాగ్ శెట్టి-సాత్విక్‌సాయిరాజ్ జోడికి.. కాంస్యం మాత్రమే..!
బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో చిరాగ్ శెట్టి-సాత్విక్‌సాయిరాజ్ జోడి కాంస్య పతకాన్ని
బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో చిరాగ్ శెట్టి-సాత్విక్‌సాయిరాజ్ జోడి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఈ ఏడాది భారత్ తరపున పతకం దక్కించుకుంది వీరు మాత్రమే..! శనివారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో మలేషియా జంట ఆరన్ చియా-సోమ్ వూ యిక్‌లు 22-20, 18-21, 16-21 స్కోర్‌తో భారత జోడిపై గెలుపొందారు. 76 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో మలేషియా జోడిని భారత్ నిలువరించలేకపోయింది. తొలి గేమ్‌లో భారత జట్టు నెగ్గినా.. ఆ తర్వాత రెండు గేమ్‌లను కోల్పోయింది. తొలి గేమ్ ఓడినప్పటికి వరల్డ్ నెంబర్-7 అయిన మలేషియా జంట ఫుంజుకొని భారత ద్వయానికి మరో అవకాశం ఇవ్వకుండా వరుస గేముల్లో ఓడించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సెమీస్‌కు వెళ్లిన తొలి భారత మెన్స్ జోడిగా చిరాగ్-సాత్విక్ జంట రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. సాత్విక్-చిరాగ్ జంట ఆల్‌ఇంగ్లండ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకొని సంచలనం సృష్టించగా. ఆ తర్వాత ఇండియా ఓపెన్, థామస్ కప్, కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణాలు చేజిక్కించుకున్నారు. తాజాగా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన సాత్విక్- చిరాగ్ శెట్టి జోడి కొత్త చరిత్ర సృష్టించింది.