కిదాంబి శ్రీకాంత్ ఓటమి.. ప్రీ క్వార్టర్స్ లో అడుగుపెట్టిన లక్ష్య సేన్
కిదాంబి శ్రీకాంత్ బుధవారం నాడు ప్రపంచ 32వ ర్యాంకర్ జావో జున్ పెంగ్‌తో వరుస గేమ్‌లలో
గత BWF ప్రపంచ ఛాంపియన్ షిప్ లో రన్నరప్ గా నిలిచిన కిదాంబి శ్రీకాంత్ ఈసారి ఆదిలోనే టోర్నమెంట్ నుండి బయటకు వచ్చేశాడు. కిదాంబి శ్రీకాంత్ బుధవారం నాడు ప్రపంచ 32వ ర్యాంకర్ జావో జున్ పెంగ్‌తో వరుస గేమ్‌లలో ఓడిపోయి ప్రపంచ ఛాంపియన్‌షిప్ నుండి నిష్క్రమించాడు. కేవలం 34 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్ 18-21, 17-21తో జావో జున్ పెంగ్ చేతిలో ఓడిపోయాడు. మ్యాచ్‌లో 1-0 ఆధిక్యం సాధించడానికి జావోకు కేవలం 12 నిమిషాల సమయం మాత్రమే పట్టింది. ఓపెనింగ్ గేమ్ లో కిదాంబి శ్రీకాంత్ పెద్దగా రాణించలేకపోయాడు. రెండో గేమ్‌లో 16-14తో ఆధిక్యంలోకి వెళ్లినా.. చాలా అనవసర తప్పిదాలు చేయడంతో జావో విజయాన్ని ఖాయం చేశాయి.
కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ లక్ష్య సేన్ స్పెయిన్‌కు చెందిన లూయిస్ పెనాల్వర్‌పై వరుస గేమ్‌లతో విజయం సాధించి పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్‌ఫైనల్‌లోకి దూసుకెళ్లాడు. లక్ష్య సేన్ ఈ మ్యాచ్ లో 21-17 21-10తో విజయం సాధించాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత అయిన సేన్, స్పానిష్ షట్లర్‌పై తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. మొదటి గేమ్ లో ప్రత్యర్థి కాస్త మంచి గేమ్ ఆడినా.. రెండవ గేమ్‌ను భారీ తేడాతో గెలిచాడు లక్ష్య సేన్.
ఇక అంతకు ముందు 8వ సీడ్ కు ఊహించని షాక్ ఇచ్చింది భారత యువ పురుషుల డబుల్స్ జోడీ. ధృవ్ కపిల- MR అర్జున్ 8వ సీడ్ కిమ్ ఆస్ట్రప్- అండర్స్ రాస్‌ముస్సేన్‌లను 2వ రౌండ్‌లో ఓడించారు. బుధవారం ఆగస్టు 24న జరిగిన ఈ మ్యాచ్ లో అద్భుతమైన విజయాన్ని భారత డబుల్స్ బృందం సొంతం చేసుకుంది. వరల్డ్ ఛాంపియన్స్ చివరి ఎడిషన్‌లో కిమ్ ఆస్ట్రప్- అండర్స్ రాస్‌ముస్సేన్ కాంస్య పతకాన్ని సాధించారు. వారిని ఓడించడానికి ధ్రువ్ కపిల, MR అర్జున్‌లకు కేవలం 40 నిమిషాలు మాత్రమే అవసరమైంది. 2వ రౌండ్ మ్యాచ్‌లో 21-17, 21-16 తేడాతో భారత జోడీ విజయం సాధించింది.