డబుల్స్ లో 8వ సీడ్ కు షాకిచ్చిన ధృవ్ కపిల- MR అర్జున్ జోడీ
వరల్డ్ ఛాంపియన్స్ చివరి ఎడిషన్‌లో కిమ్ ఆస్ట్రప్- అండర్స్ రాస్‌ముస్సేన్ కాంస్య పతకాన్ని సాధించారు.
టోక్యోలో జరుగుతున్న BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 8వ సీడ్ కు ఊహించని షాక్ ఇచ్చింది భారత యువ పురుషుల డబుల్స్ జోడీ. ధృవ్ కపిల- MR అర్జున్ 8వ సీడ్ కిమ్ ఆస్ట్రప్- అండర్స్ రాస్‌ముస్సేన్‌లను 2వ రౌండ్‌లో ఓడించారు. బుధవారం ఆగస్టు 24న జరిగిన ఈ మ్యాచ్ లో అద్భుతమైన విజయాన్ని భారత డబుల్స్ బృందం సొంతం చేసుకుంది.
వరల్డ్ ఛాంపియన్స్ చివరి ఎడిషన్‌లో కిమ్ ఆస్ట్రప్- అండర్స్ రాస్‌ముస్సేన్ కాంస్య పతకాన్ని సాధించారు. వారిని ఓడించడానికి ధ్రువ్ కపిల, MR అర్జున్‌లకు కేవలం 40 నిమిషాలు మాత్రమే అవసరమైంది. 2వ రౌండ్ మ్యాచ్‌లో 21-17, 21-16 తేడాతో భారత జోడీ విజయం సాధించింది. 2022లో మంచి ఫామ్ లో దూసుకుపోతున్న ధృవ్- అర్జున్‌లకు ఇది పెద్ద విజయం. ఈ మ్యాచ్ లో గెలిచి ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌లో చోటు సంపాదించారు. ప్రపంచ నం. 35 జోడీ అయిన ధృవ్- అర్జున్ లు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ప్రారంభ రౌండ్‌లో సుపక్ జోమ్‌కో, కిట్టినుపాంగ్ కేడ్రెన్‌ల నుండి గట్టి పోటీని ఎదుర్కొని విజయాన్ని అందుకుంది. ధృవ్-అర్జున్ జోడీ ఇటీవలి కాలంలో మంచి ప్రదర్శన చేస్తూ వెళుతున్నారు. భారతదేశం తరపున రెండవ అత్యధిక ర్యాంక్ కలిగి ఉన్న పురుషుల డబుల్స్ జోడీ ఇది. మంచి ఫామ్‌లో ఉన్నారు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ముందు సింగపూర్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు.