Adimulapu Suresh : వైసీపీలో మరో గంటా..ఈసారి కూడా లక్ చేతికి దక్కేనా?
ఆదిమూలపు సురేష్ నియోజకవర్గాలను మారుస్తున్నారు. అయితే విజయం మాత్రం ఆయనను వదలడం లేదు
కొందరు రాజకీయనేతలుంటారు. ప్రతి ఎన్నికకు నియోజకవర్గం మారుతుంటారు. టీడీపీలో ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గంలో మరొకసారి పోటీ చేయరు. అందుకే ఆయనకు ఓటమి దరి చేరదు. దాదాపుగా అన్ని సార్లు ఆయన గెలుస్తూనే వస్తున్నారు. గంటా శ్రీనివాసరావు ఈసారి కూడా మళ్లీ నియోజకవర్గాన్ని మార్చారు. అలాగే వైసీపీలోనూ మరో గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయనే మంత్రి ఆదిమూలపు సురేష్. ప్రకాశం జిల్లాలోని ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో ఆయన మారుతూ గెలుస్తూ ఇప్పటి వరకూ మూడు సార్లు గెలిచారు. గత ఎన్నికల్లో విజయం సాధించి ఆయన పూర్తి కాలం జగన్ కేబినెట్ లో మంత్రి పదవిని చేపట్టారు.
ఐఆర్ఎస్ అధికారి నుంచి...
ఆదిమూలపు సురేష్ ఐఆర్ఎస్ అధికారిగా పనిచేస్తూ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చీ రావడంతోనే ఆయన వైఎస్ నేతృత్వంలోని అప్పటి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి యర్రగొండపాలెంట నుంచి పోట ీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత వైఎస్ మరణంతో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత జరిగిన ఎన్నికలోనూ ఆయన నియోజకవర్గాన్ని మార్చారు. 2014 ఎన్నికల్లో ఆయన సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే అప్పడు వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. అయితే జగన్ వెంటే ఆదిమూలపు సురేష్ నడిచారు.
వరసగా మారుతూ...
2019 ఎన్నికల్లో సంతనూతలపాడును వదిలిపెట్టి తిరిగి 2009లో తాను పోటీ చేసిన యర్రగొండపాలెంను ఎంచుకున్నారు. అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఈసారి అదృష్టం ఆయన ఇంటి తలుపు తట్టింది. జగన్ మంత్రివర్గంలో మంత్రి పదవి దక్కించుకున్నారు. తొలి రెండున్నరేళ్లు ప్రాధమికవిద్యాశాఖ మంత్రిగా, తర్వాత రెండేళ్లు మున్సిపల్ శాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ పనిచేశారు. జగన్ కు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా ఆయన కొనసాగుతున్నారు. అయితే నాలుగోసారి తాను యర్రగొండపాలెం నుంచి పోటీ చేయాలని భావించారు. తొలి నుంచి ఆ నియోజకవర్గంలో ఫోకస్ పెట్టారు. మంత్రిగా కూడా ఉండటంతో ఆయన అభివృద్ధి పనులు కూడా అంతే స్థాయిలో చేశారు.
మార్చేస్తారా?
కానీ ఈసారి ఆయన నియోజవర్గాన్ని జగన్ మార్చేశారు. యర్రగొండపాలెం నుంచి కొండపి నియోజకవర్గానికి ఆదిమూలపు సురేష్‌ను షిఫ్ట్ చేశారు. అక్కడి నుంచి పోటీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సర్వేలో యర్రగొండపాలెంలో సురేష్ కు ప్రతికూల ఫలితాలు రావడంతో ఆయనను కొండపికి వెళ్లాలని సూచించారు. కొండపిలో టీడీపీ బలంగా ఉంది. అక్కడ వైసీపీ జెండా ఇంత వరకూ ఎగరలేదు. 2009లో కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత వరసగా అక్కడ టీడీపీ అభ్యర్థి డోలా బాలవీరాంజనేయస్వామి గెలుస్తూ వస్తున్నారు. మరి ఆదిమూలపు సురేష్ ఈసారి కొండపిలో గెలిచి రికార్డును తిరగరాస్తారా? లేదా అన్నది చూడాల్సి ఉంది.