కొందరికి నచ్చకపోయినా...
చంద్రబాబు నిర్ణయాలు కొందరికి నచ్చకపోవచ్చు. వ్యతిరేకించ వచ్చు. అయితే ఆయన మాత్రం తాను అనుకున్నది అనుకున్నట్లే చేస్తారు. ముందు తరాల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఆయన నిర్ణయాలుంటాయి. ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేయకపోవచ్చు. కానీ సంపదను ఎలా పెంచాలన్న దానిపై ఆయనలో ఒక ఆర్థిక నిపుణుడు దాగి ఉన్నాడని భావించాలి. ఐఏఎస్ ల మాట విన్నట్లు ఉంటూనే తన ఆలోచనలను సున్నితంగా అమలు చేయించడంలో దిట్ట. వారిని నొప్పించకుండా తన పనిని పూర్తి చేసుకోగలరు. 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా అయిన నాటి నుంచి మొన్నటి వరకూ రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసే నేతగా ఆయనకు పేరుంది. వయసుతో సంబంధం లేని వారు చంద్రబాబును వ్యతిరేకిస్తారంటే ఆయనలో ఉన్న పని రాక్షసుడిని చూసే. కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు ఇది గిట్టకపోవచ్చు. కానీ చంద్రబాబు మాత్రం తన పని తాను చేసుకుపోతారు.
కష్టాలను అధిగమించి...
ఇక 2019 ఎన్నికల్లో ఘోర ఓటమిని చంద్రబాబును కూడా ఊహించలేదు. కేవలం 23 సీట్లకే పరిమితమయిన పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ఆయన పడిన శ్రమ అంతా ఇంతా కాదు. దాదాపు మూడేళ్ల పాటు నేతలు ఎవరూ రోడ్లపైకి రాలేదు. అయినా చంద్రబాబు నయానో.. భయానో వారిని హెచ్చరిస్తూ తాను మాత్రం ప్రజల్లో ఉంటూ పార్టీ క్యాడర్ ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ప్రభుత్వం చేసిన విధ్వంసాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. ఒకరకంగా చెప్పాలంటే సీనియర్ నేతలు కూడా చేతులెత్తేసిన సమయంలో పార్టీని మళ్లీ గెలిచే స్థాయికి తెచ్చారంటే ఆయనలో చురుకుదనం, ఆత్మవిశ్వాసానికి ఎవరైనా చేతులెత్తి నమస్కరించాల్సిందే. ఎందుకంటే మరొక నేత అయితే కాడి వదిలేసి వెళ్లిపోయారు. ఆయన అసెంబ్లీలో కూడా ఓపిక బిగబట్టి కూర్చుని తనపై నేరుగా చేసే విమర్శలను నవ్వుతూ స్వీకరిస్తూ విపక్షాలకు కూడా అర్థం కాకుండా మారారు. తర్వాత ఆయన అనుకోని పరిస్థితుల్లో శపథం చేసి శాసనసభ నుంచి బయటకు వెళ్లిపోయారు.
అందరినీ కలుపుకుని...
ఇక జగన్ ను తాను ఒక్కడినే ఎదుర్కొనలేనని ఆయనకు తెలుసు. జగన్ ఆర్థికంగా బలవంతుడు. తమ పార్టీకి చెందిన నేతల ఆర్థిక మూలాలను ఈఐదేళ్లలో దారుణంగా దెబ్బతీశాడు. వారిని అనుకోని ప్రయోజనం లేదు. అందుకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఆసరాగా తీసుకున్నారు. తనపై కేసులు పెట్టి యాభై రెండు రోజుల పాటు జైలులో ఉంచినా న్యాయపోరాటం చేసి బయటకు వచ్చారు. ఈసారి ఎన్నికల్లో గెలవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బలం తోడయితే మంచిదని భావించారు. పార్టీలో కొందరు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించినా పట్టించుకోలేదు. చివరకు బీజేపీనే తన దారికి తెచ్చుకోగలిగారు. సీట్లు త్యాగం చేయాల్సి వచ్చిందేమో కానీ.. ఎలక్షనీరింగ్ లో పై చేయి సాధించగలిగారంటే అది కమలం పార్టీ పుణ్యమే. అందుకే అందరినీ కలుపుకుని జగన్ పై యుద్ధం చేశారు. మ్యానిఫేస్టో కంటే జగన్ పై విమర్శలకే ఎక్కువ సమయం కేటాయించడం కూడా ప్రత్యర్థిపై వ్యతిరేకత రావాలనే.. అందుకే చంద్రబాబు మంచి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అంటారు. ఆయనను మించిన ఎన్నికల వ్యూహకర్త రాజకీయాల్లో ఎవరుంటారు? అందుకే చంద్రబాబుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా మరొకరు సాటిరారు. ఇది అక్షర సత్యం.