Ap Elections : భావోద్వేగాలు మరింత పెరుగుతాయా?.. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఏపీలో మారిన సీన్
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసినా టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఎగ్జిట్ పోల్స్ పోటా పోటీగా రావడంతో అది మరింత ఎక్కువయింది
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసినా ఇంకా టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఎగ్జిట్ పోల్స్ కూడా పోటా పోటీగా చెప్పడంతో అది మరింత ఎక్కువయింది. దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎస్పీలకు, కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాలలో కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని కోరారు. పోటా పోటీగా అధికారంలోకి వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పడంతో మీనా సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. ఎస్సీ, కలెక్టర్లు సమన్వయంతో పనిచేస్తూ కౌంటింగ్ కు ఎలాంటి విఘాతం కలగకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
పోలింగ్ అనంతరం...
ఇప్పటికే పోలింగ్ అనంతరం రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో అనేక చోట్ల ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మొహరించారు. ప్రతి రోజూ సున్నిత ప్రాంతాల్లో కవాతు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కౌంటింగ్ జరిగే రోజు దుకాణాలన్నీ బంద్ చేయాలని కూడా కొన్ని చోట్ల ఆదేశాలు జారీ చేశారు. నువ్వా? నేనా? అన్నట్లు ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడి కావడంతో మరింతగా అల్లరిమూకలు రెచ్చిపోయే అవకాశముందని అంచనా వేసిన ఎన్నికల కమిషన్ ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
కౌంటింగ్ కేంద్రాల వద్ద...
దీంతో పాటు జూన్ 4వ తేదీన కౌంటింగ్ కేంద్రాల్లోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొంది. రెండు పార్టీలు సమంగా వస్తే ఉద్రిక్తతలు పెరిగి కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారిని వెంటనే బయటకు పంపించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించవద్దని పేర్కొంది. భావోద్వేగాలు మరింత పెరిగి హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశముండటంతో ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఏపీలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.