Purandhreswari : చిన్నమ్మ మీద ఈ ట్రోల్స్ ఏంటి బాబూ.. ఆయన చెప్పినట్లే చేస్తున్నారని అనుమానమా?
ఏపీ లో కూటమి ఏర్పడిన తర్వాత ఎక్కువగా ట్రోలింగ్ గురవుతున్న నేత ఎవరైనా ఉన్నారంటే బీజేపీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి
ఆంధ్ర్రప్రదేశ్ లో కూటమి ఏర్పడిన తర్వాత ఎక్కువగా ట్రోలింగ్ గురవుతున్న నేత ఎవరైనా ఉన్నారంటే బీజేపీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి అని మాత్రమే చెప్పాలి. ఎందుకంటే.. కూటమి ఏర్పాటు నుంచి ఆమెపై విమర్శలు చేసే వారు కూడా ఎక్కువయ్యారు. వైసీపీ నేతలే కాదు.. ఆ పార్టీకి చెందని అభిమానులు సోషల్ మీడియాలో పురంద్రీశ్వరిని అనేక రకాలుగా కామెంట్స్ చేస్తూ రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారనడంలో సందేహం లేదు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కుదిరి మూడు పార్టీలూ కలసి ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. మూడు పార్టీలు తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించడంతో ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు.
వైసీపీని లక్ష్యంగా...
పురంద్రీశ్శరి బీజేపీ అధ్యక్షరాలు అయిన నాటి నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ వెళుతున్నారన్నది వైసీపీ ఆరోపణ. అందులో ముఖ్యంగా చంద్రబాబు స్కిల్ డెవెలెప్‌మెంట్ స్కామ్ లో అరెస్టయిన తర్వాత మరింతగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారంటూ ఆమె పై కామెంట్స్ పెడుతున్నారు. అప్పటికి ఇంకా పొత్తు ఖరారు కాకపోవడంతో చంద్రబాబుకు నేరుగా సంఘీభావం తెలపలేదు కానీ, పరోక్షంగా ఆమె మద్దతిచ్చారంటున్నారు. అలాగే ఇక పొత్తు విషయంలోనూ బీజేపీని ఒప్పించడంలో చిన్నమ్మ కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. లోక్‌సభ స్థానాలు ఏపీలో బీజేపీ గెలవాలంటే పొత్తు తప్పదని పదే పదే అధినాయకత్వానికి చెప్పి మరీ ఆమె ఒప్పించారంటారు.
ఆమె ద్వారా అయితే...
ఇక పొత్తు కుదిరిన తర్వాత ఏపీలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ జగన్ పై నేరుగా విమర్శలు చేయకపోవడం కూడా కొంత టీడీపీ నేతలను ఆలోచనలో పడేసింది. తాము అడిగిన డిమాండ్లను కేంద్ర ఎన్నికల కమిషన్ చేయదని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు పురంద్రీశ్వరి నుంచి పనికానిచ్చేలా చర్యలు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ కనపడుతున్నాయి. వైసీపీ నేతలయితే నేరుగానే విమర్శలు చేస్తున్నారు. 22 మంది అధికారులను మార్చాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కు పురంద్రీశ్వరి లేఖ రాయడమే కాకుండా, వారి స్థానంలో ఎవరిని నియమించాలో కూడా చిన్నమ్మ సూచించడం వెనక చంద్రబాబు డైరెక్షన్ ఉందంటున్నారు.
ఎన్నికల సంఘానికి...
ఎన్నికల సమయంలో అధికారులపై ఫిర్యాదు చేయడం మామూలే. కానీ టీడీపీ మాటలను పెద్దగా ఎన్నికల కమిషన్ విశ్వసించకపోవచ్చన్న కారణంతో పురంద్రీశ్వరిని ప్రయోగించారంటున్నారు. అందుకే వైసీపీకి అనుకూలురైన అధికారుల జాబితాను టీడీపీ రూపొందించి పురంద్రీశ్వరికి ఇచ్చారని, ఆమె ఆ జాబితాను యధాతధంగా ఎన్నికల కమిషన్ కు పంపారని విమర్శిస్తున్నారు. ఇలా తనకు అధికారులను మార్చడంలో వీలు కాదని భావించిన చంద్రబాబు పురంద్రీశ్వరి ద్వారా ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వైసీపీ నేతలు చేస్తున్నారు. ఇలా చిన్నమ్మ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనే కూడా కూటమిలో క్వీన్ గా మారారంటూ నెట్టింట వైసీపీ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.