Mudragada : ముద్రగడ వైసీపీకి బలమా? బలహీనతగా మారారా? హాట్ టాపిక్ ఇన్ ఫ్యాన్ పార్టీ
కూటమి ఏర్పాటయిన తర్వాత కాపు సామాజికవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కొంత వ్యతిరేకత ఉంది
ఒక్కోసారి రాజకీయాలు తాము ఒకటి తలిస్తే మరొక దిశగా పయనిస్తాయి. అనుకున్న దారిలో పయనించకపోవడానికి అనేక కారణాలుంటాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయినా ప్రతి చిన్న అంశంలోనూ పోస్టుమార్టం జరుగుతుంది. ఎంతగా అంటే కులాల వారీగా అనుకూలమా? వ్యతిరేకమా? అన్న రీతిలో విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఏపీలో బలమైన సామాజికవర్గం కాపులు. కాపులు అనేక నియోజకవర్గాల్లో కీలక భూమిక పోషిస్తారన్నది అందరికీ తెలుసు. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజికవర్గం ఓట్లు ఎటువైపు మళ్లాయన్న చర్చ సహజంగానే జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీయే అధికారంలోకి వస్తుందన్న నమ్మకం, సెంటిమెంట్ ఉండటంతో సహజంగా ఆ దిశగా అనేక మంది ఈ సామాజికవర్గం ఓట్లు ఎటువైపు పడ్డాయన్న దానిపై ఆరా తీస్తున్నారు.
తొలినాళ్లలో పవన్ పై అసంతృప్తి...
కూటమి ఏర్పాటయిన తర్వాత కాపు సామాజికవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కొంత వ్యతిరేకత ఉంది. కొంత మాత్రమే కాదు.. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును పరామర్శించేందుకు వెళ్లి ఎవరితో సంప్రదించకుండానే నేరుగా వచ్చి పొత్తు పెట్టుకుంటున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించడం కాపు సామాజికవర్గంలో అసహనం రేగింది. వాళ్లు అడగకపోయినా.. పొత్తును అంత అత్యవసరంగా ప్రకటించాల్సిన అవసరమేంటన్న ప్రశ్న తలెత్తింది. కాపులు కొందరు సామాజిక మాధ్యమాల్లో దీనిని బహిరంగంగానే వ్యతిరేకించారు. అయితే తనకంటూ ఒక వ్యూహముందంటూ జనసేనాని చెప్పుకొచ్చారు. తర్వాత హరిరామజోగయ్య లాంటి నేతలు కనీసం యాభై స్థానాలకు పైగా తీసుకోవాలని పదే పదే లేఖలు రాసినా పవన్ నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు. చివరకు 21 స్థానాలకే పరిమితమయ్యారు. కూటమి గెలిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అని లోకేష్ చేసిన వ్యాఖ్యలు కూడా కాపు సామాజికవర్గం అహాన్ని దెబ్బతీశాయి. దీంతో పవన్ కు చాలా మంది కాపులు దూరమయ్యారు.
ఒకే ఒక అడుగు...
పవన్ ను చూసి ఓటేసినా అది టీడీపీకే లబ్ది చేకూరుతుందని భావించారు. ఇలా జరుగుతున్న సమయంలో వైసీపీ వేసిన ఒకే ఒక అడుగు కాపులను పవన్ కు మళ్లీ దగ్గర చేసిందంటారు. జగన్ గత ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇవ్వలేనని చెప్పినా కాపుల్లో అధిక భాగం జగన్ కు మద్దతిచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకంటే బీసీలకు ఎక్కువగా జగన్ ప్రయారిటీ ఇవ్వడం కాపులకు మింగుడు పడటం లేదు. అయినా సరే చంద్రబాబుతో పోలిస్తే జగన్ కొద్దోగొప్పో బెటర్ అన్న భావనలో ఉన్న కాపు సామాజికవర్గానికి ముద్రగడ చేరికతో వైసీపీకి దూరమయ్యారంటారు. ముద్రగడ కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు చేసినప్పటికీ, కేవలం స్వార్థ రాజకీయాల కోసమే వైసీపీలో చేరారని, వైసీపీ కూడా తమ సామాజికవర్గం ఓట్లు గండికొట్టి పవన్ ను దెబ్బతీయాలన్న ఉద్దేశ్యంతోనే వైసీపీ ముద్రగడను పార్టీలోకి చేర్చుకుందన్న వాదన కాపు సామాజికవర్గంలో బలంగా నాటుకుపోయింది. ఎంతగా అంటే టీడీపీపై గతంలో ఉన్న ఆగ్రహం స్థానంలో ప్రేమ పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించిందంటారు.
ముద్రగడ వ్యాఖ్యలు కూడా...
దీంతో పాటు పవన్ కల్యాణ్ ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ముద్రగడ చేసిన శపథం కూడా కాపులలో ఐక్యతకు మరింత కారణమయిందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. ముద్రగడ మౌనంగా ఉన్నట్లయితే వైసీపీకి ఇంత డ్యామేజీ జరిగేది కాదని అంటున్నారు. ముద్రగడ పవన్ కల్యాణ్ పై ఒంటికాలుపై లేవడంతో పాటు వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల అది కూటమికి లాభించిందని చెబుతున్నారు. కాపు సామాజికవర్గంలో దాదాపు 70 శాతం మంది కూటమి వైపు నిలబడటానికి ప్రధాన కారణం ముద్రగడ పద్మనాభం అంటూ కొందరు నేరుగా చెబుతుండటం చూస్తే వైసీపీకి ముద్రగడ ఎఫెక్ట్ బలంగానే ఉభయ గోదావరి జిల్లాలో పడినట్లు కనిపిస్తుంది. మొత్తం మీద ముద్రగడ చేరికతో అప్పటి వరకూ సాఫ్ట్ కార్నర్ గా ఉన్న కాపులు టీడీపీ వైపు బలంగా టర్న్ అయ్యారంటున్నారు. మరి ఏం జరిగిందన్నది చూడాల్సి ఉంది.