Ap Elections Counting : బాబాయ్ బీపీ పెరిగిపోతుందిగా... నాడి దొరకడం లేదు...నరాలు చిట్లేంత ఉత్కంఠ మునుపెన్నడూ లేదే?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. రేపు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో అందరిలోనూ టెన్షన్. ఒకరు కాదు.. ఇద్దరు.. కాదు.. వేలు కాదు.. లక్షల్లో పార్టీ అధినేతల నుంచి కార్యకర్తల వరకూ ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నారు. బీపీ పెరిగిపోతుంది. నరాలు చిట్లిపోతున్నాయి. ఇలా అనేక మంది ఉత్కంఠతో ఎదురు చూడటం గతంలో ఎప్పుడూ పడలేదంటున్నారు. ఎందుకంటే ప్రచారం దగ్గర నుంచి పోలింగ్ వరకూ అంతా టెన్షన్. ఎవరి సభలకు ఎంత మంది అంచనాలు వేసుకుని మరీ బీపీలను పెంచుకున్నారు. అంతటితో ఆగలేదు. అభ్యర్థుల ఎంపిక నుంచి మ్యానిఫేస్టో విడుదల వరకూ అంతా టెన్షన్. కానీ చివరకు పోలింగ్ శాతం మరింత పెరగడంతో ఈసారి ఎవరి వైపు అధికారం మొగ్గు చూపుతుందన్నది ఎవరికీ అర్థం కాకుండా ఉంది.
గత రెండు ఎన్నికల్లో...
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన గత రెండు ఎన్నికల్లో ఇంత పెద్దగా ఆసక్తి లేదు. ఉత్కంఠ లేదు. 2014లో అందరూ ఊహించినట్లే కూటమి అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో జగన్ పాదయాత్రతో హైప్ రావడంతో ఆ పార్టీకి అధికారంలోకి రావడం గ్యారంటీ అని ఎన్నికలకు రెండు నెలల ముందే తెలిసిపోవడంతో ఎన్నికల రిజల్ట్ విషయంలో ఇంత పెద్దగా టెన్షన్ పడలేదు. కానీ ఈసారి అలా కాదు. ఓటర్లు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. మనసులో మాటను బయటకు చెప్పరు. గుంభనంగా ఓటు వేసి వారి ఇంటికి వెళ్లిపోయారు. ఈసారి మాత్రం ఏపీ ఎన్నికల్లో పోరు జగన్ వర్సెస్ యాంటీ జగన్ గా జరిగిందని మాత్రం చెప్పుకోవచ్చు. అయితే జగన్ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉంది? అది కూటమికి ఎంత మేరకు లాభపడింది? అన్నదే ఇప్పుడు అసలైన టెన్షన్. అందుకే ఈసారి రిజల్ట్ ఎవరికీ అందడం లేదు.
ఎగ్జిట్ పోల్స్ తర్వాత...
నాడి పట్టుకుందామనుకున్నా దొరకడం లేదు. ఇక ఎగ్జిట్ పోల్స్ తర్వాత టెన్షన్ మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు. ఎందుకంటే అన్ని సంస్థలు తలోరకంగా ఇచ్చాయి. స్థానిక సమస్యలు.. సామాజికవర్గాలను స్పృశించాయా? అన్న అనుమానం మాత్రం ఎగ్జిట్ పోల్స్ చూసిన వారికి ఎవరికైనా కలుగుతుంది. జాతీయ మీడియా నుంచి స్థానికంగా ఉండే సర్వే సంస్థలన్నీ ఇటు అధికార వైసీపీకి, అటు ప్రతిపక్ష కూటమి పార్టీకి అనుకూలంగా రిజల్ట్ వస్తుందని తెలియజేయడంతో గెలుపు ఎవరిది అన్నది ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా స్పష్టత రాకుండా ఉంది. ఇది డిఫరెంట్ గా ఉంది. గతంలో ఎప్పుడూ ఇలా లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉంటే.. ప్రతిపక్షం అధికారంలోకి వస్తుందని అంచనా వేయవచ్చు. అలాగే ప్రతిపక్షంపై బలంగా సానుకూలత ఉన్నా వారిదే విజయం అని నమ్మవచ్చు. కానీ ఈ ఎన్నికలలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.
ఎవరికి వారే...
ఎవరికి వారే తమదే అధికారం అని చెప్పుకుంటున్నా.. లోపల మాత్రం గుబులు.. దిగులు.. ఇరుపార్టీలకూ ఉంది. అన్నీ లెక్కలు వేసుకుంటున్నారు. ప్రాంతాలుగా వారీగా లెక్కలు వేసుకుని కూటమి నేతలు గెలుపు తమదేనని చెబుతుంటే... ఈసారి ప్రాంతాలు, కులాలు అనేవి ఉండవని, ఏకపక్షంగా ఓటర్లు తమ వైపు మొగ్గు చూపారని అధికార వైసీపీ చెబుతుంది. ఎన్నో కీలక విషయాలను మాత్రం జనం ఈసారి పట్టించుకోలేదన్నది మాత్రం యదార్థం. చంద్రబాబును జైలులోకి పంపించడం, లోకేష్ పాదయాత్ర ఇటు కూటమికి సానుకూలతను తెచ్చిపెట్టలేదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అదే సమయంలో సంక్షేమ పథకాలు కూడా పెద్దగా పనిచేయలేదని, అందుకే అధికార పార్టీకి ఈ ఎన్నికలు కష్టమేనన్న వ్యాఖ్యలు కూడా అంతే బలంగా వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఇటు వైఎస్ జగన్, అటు చంద్రబాబు ఇంట్లో కూర్చుని టెన్షన్ పడుతుంటే.. మిగిలిన నేతలు, కార్యకర్తలు మాత్రం ఎలాంటి ఫలితం వస్తుందోనన్న టెన్షన్ లో ఇంటా బయటా తిరుగుతూ టెన్షన్ ను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు.