Ap Elections Exit Polls : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈసారి గణనీయమైన మార్పులు.. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారి?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. కౌంటింగ్ మరో రెండు రోజుల్లో పూర్తవుతుంది. అ
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. కౌంటింగ్ మరో రెండు రోజుల్లో పూర్తవుతుంది. అయితే ముందుగా వెలువడయిన ఎగ్జిల్ పోల్స్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి శాసనసభలో నాలుగు పార్టీలు కనిపించబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఆధారంగానే ఈ వార్త అయినా ఖచ్చితంగా ఈసారి నాలుగు పార్టీలు ఏపీ శాసనసభలోకి కాలుమోపే అవకాశముంది. అందుకే ఈసారి ఏపీ శాసనసభకు ప్రత్యేకత ఉంది. నాలుగు పార్టీలా? ఐదు పార్టీలా? అన్నది కౌంటింగ్ తర్వాత తెలియనుంది కానీ.. ఇప్పటి వరకూ ఎగ్జిట్ పోల్స్ వరకూ అయితే మాత్రం నాలుగు పార్టీలు ఖచ్చితంగా శాసనసభలోకి అడుగుపెట్టనున్నాయి.
ఇప్పటి వరకూ మూడు...
2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మూడు పార్టీలే శాసనసభలోకి ప్రవేశించాయి. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగా, వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఆ సమయంలో కూటమిలో ఉన్న బీజేపీ కూడా శాసనసభలో భాగమయింది. 2019లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ ప్రజలు మూడు పార్టీలకే పట్టం కట్టారు. ఈసారి త్రిముఖ పోటీ జరగడంతో వైసీపీ, టీడీపీ, జనసేన శాసనసభలోకి అడుగుపెట్టాయి. వైసీపీ అధికారంలోకి రాగా, టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా మారింది. అంటే ఇప్పటి వరకూ రెండు సార్లు జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కేవలం మూడు పార్టీలు మాత్రమే శాసనసభలో కాలుమోపాయని చెప్పకతప్పదు.
ఈసారి నాలుగు పార్టీలు...
2024లో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఈసారి నాలుగు పార్టీలు శాసనసభలోకి అడుగుపెట్టే అవకాశముంది. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీలు ఈసారి శాసనసభలోకి కాలుమోపనున్నాయి. అంటే బీజేపీ 2014లో శాసనసభలోకి అడుగుపెట్టినా 2019 లో రాలేకపోయింది. 2014లో జనసేన పోటి చేయకపోవడం వల్ల 2019 లో అడుగు పెట్టింది. ఇలా నాలుగు పార్టీలు, నాలుగు కండువాలు, నాలుగు జెండాలు శాసనసభలో కనిపించనున్నాయని చెప్పక తప్పదు. అదే సమయంలో ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మాత్రం కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీలు శాసనసభలోకి ప్రవేశించలేకపోయాయి.
కాంగ్రెస్, కమ్యునిస్టులు...
2014లో కమ్యునిస్టులు విడిగా పోటీ చేయడం, 2019 ఎన్నికల్లో జనసేనతో కూటమి కట్టినా ప్రయోజనం లేకపోయింది. 2024లో కాంగ్రెస్ తో కలసి ఎన్నికల బరిలోకి దిగాయి. అయితే ఈసారి కూడా కమ్యునిస్టులకు శాసనసభలోకి అడుగుపెట్టే అవకాశం లేదన్నది ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం తెలుస్తుంది. మరోవైపు రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ను పదేళ్లుగా రెండుసార్లు ఏపీ ప్రజలు తిరస్కరించారు. ఎంతగా అంటే డిపాజిట్లు కూడా రానంతగా. ఈసారి కూడా ఆ పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. కాకుంటే గతం కంటే కొంత మెరుగైన ఓటింగ్ శాతం మాత్రం పెరిగే అవకాశముంది తప్పించి కాంగ్రెస్ ఈసారి కూడా శాసనసభలోకి అడుగు పెట్టే అవకాశం లేదన్నది అంతే వాస్తవమని చెప్పకతప్పదు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఈ అంచనా అయినా వాస్తవ ఫలితాలు కూడా ఇందులో పెద్దగా మార్పు ఉండే అవకాశం ఉండకపోవచ్చు.