Ap Elections : జెండాలు వేరైనా.. అజెండాలు ఒక్కటేనన్నా.. జనం నమ్ముతారా గ్రౌండ్ రిపోర్ ఎలా ఉందంటే?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలకు ఇంకా గంటలు మాత్రమే సమయం ఉంది.

Update: 2024-06-03 08:39 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలకు ఇంకా గంటలు మాత్రమే సమయం ఉంది. అయితే నల్లారి సోదరుల గెలుపోటములపై రాజకీయంగా పెద్ద చర్చే జరుగుతుంది. ఎందుకంటే తొలిసారి ఇద్దరు బ్రదర్స్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఇప్పటి వరకూ ఒకరు పోటీ చేస్తే మరొకరికి అండగా నిలవడం మాత్రమే చేస్తూ వచ్చారు. కానీ ఈసారి ఇద్దరూ ఎన్నికల బరిలో ఉన్నారు. 2014 కు ముందు వరకూ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమే రాజకీయాల్లో ఉండేవారు. ఆయన పీలేరు నుంచి ఎన్నికయ్యారు. అప్పుడు సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అంతా తానే అయి వ్యవహరించేవారు. ఆర్థిక విషయాలను కూడా కిషోర్ కుమార్ దగ్గరుండి చూసుకునే వారు. అన్న గెలుపు కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసేవారు. అందుకే సులువుగా విజయాలు దక్కేవి.

చెరొకపార్టీలో...
అయితే 2014 లో రాష్ట్ర విభజన తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. అంటే పదేళ్లు పాటు ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆయన సొంత పార్టీ పెట్టడం, దానిని మూసివేయడం, తర్వాత కాంగ్రెస్ లో చేరి చివరకు కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం 2014, 2019 ఎన్నికల్లో వరసగా పోటీ చేశారు. 2014లో అన్న పార్టీ అయిన జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరారు. నారా, నల్లారి కుటుంబాలకు అస్సలు పొసగదు. రాజకీయంగా రెండు కుటుంబాలవీ వేర్వేరు దారులుగా ఉండేవి. చంద్రబాబు టీడీపీలో ఉంటే నల్లారి కుటుంబం కాంగ్రెస్ లో కొనసాగింది. అయితే 2014 తర్వాత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అనూహ్యంగా టీడీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికల్లో పీలేరు నుంచి పోటీ చేసినా గెలుపు అందుకోలేకపోయారు.
పదేళ్ల నుంచి అచ్చిరాక...
దీంతో నల్లారి కుటుంబంలో ఎవరూ పదేళ్ల నుంచి రాజకీయాల్లో పెద్దగా కలసి రాలేదనే చెప్పాలి. అయితే ఈసారి మాత్రం బ్రదర్స్ ఇద్దరూ పోటీ చేస్తున్నారు. పీలేరు శాసనసభ నుంచి టీడీపీ అభ్యర్థిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన పాత అభ్యర్థితోనే తలపడుతున్నారు. అయితే పీలేరు లో ముస్లిం సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. టీడీపీ బీజేపీతో కలవడం వల్ల ఆ ఓటు బ్యాంకు వైసీపీకి టర్న్ అయ్యే అవకాశాలున్నాయన్న అంచనాలు వినపడుతున్నాయి. 2014, 2019 లో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మీద పోటీ చేసిన చింతల రామచంద్రారెడ్డి గెలుపొందారు. హ్యాట్రిక్ విజయం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, బీజేపీతో చెలిమి తనను మళ్లీ గట్టెక్కిస్తాయని చింతల నమ్ముతుండగా, ప్రభుత్వ వ్యతిరేకత తనకు కలసి వస్తుందని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గట్టిగా భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన ఇతర నియోజకవర్గాల బాధ్యతలను చూసినా ఈ ఎన్నికల్లో మాత్రం పీలేరుకే పరిమితమై తన గెలుపుకోసం తీవ్రంగానే ప్రయత్నించారు.
రాజంపేట ట్రాక్ రికార్డు చూస్తే...
ఇక నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విషయానికి వస్తే ఆయన పదేళ్ల తర్వాత మళ్లీ రాజకీయాల్లో రీఎంట్రీ ఇచ్చారు. ఈసారి ఆయన బీజేపీలో చేరి రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఒకరకంగా సాహసం చేసినట్లే అనిపించుకోవాలి. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 1999 లో మాత్రమే గెలిచింది. తర్వాత గెలుపే లేదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి దగ్గుబాటి పురంద్రీశ్వరి బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ట్రాక్ రికార్డు చూస్తే ఇక్కడ బీజేపీకి ఏమాత్రం అవకాశాలు కనిపించడం లేదు. కేవలం మాజీ ముఖ్యమంత్రి నల్లారి వ్యక్తిగత ఇమేజ్ మాత్రమే పనిచేస్తే చేయాలి. అంతే తప్ప ఇక్కడ బలమైన అభ్యర్థి పెద్దిరెడ్డి మిధున్ రెడ్డితో తలపడటం ఆషామాషీకాదు. అందుకే ఇద్దరు సోదరులకు ఈసారి గెలుపు అంత సులువు కాదు. చిత్తూరు, కడప జిల్లాల్లో వైసీపీ బలంగా ఉండటం కూడా ఈ అంచనాకు రావడానికి కారణంగా చెప్పవచ్చు. మరి గుర్రం ఎగరా వచ్చు.. అన్న రీతిలో ఇద్దరు గెలిచి చట్టసభల్లోకి అడుగుపెడతారా? లేక ఓటమి బాట పడతారా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News