YSRCP : డెత్ ఓవర్ లో జగన్ టీం ఏం చేయనుందో? ఇప్పటికే స్పీడ్ పెంచిన బ్లూ పార్టీ క్యాడర్

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు నాలుగు రోజులు సమయం ఉంది. అన్ని రాజకీయ పార్టీలూ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి

Update: 2024-05-09 05:43 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. అన్ని రాజకీయ పార్టీలూ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. అధికార వైసీపీ నేతలు మరింత స్పీడ్ తో ఇప్పటికే వాలంటీర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో చివరి మూడు రోజులు అత్యంత కీలకం. ఎలక్షనీరింగ్ అనేది ఈ మూడు రోజుల్లోనే జరుగుతుంది. తమకు పడే ఓట్లను గుర్తించి ఆ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకు వచ్చేంత వరకూ అన్ని రాజకీయ పార్టీలకు కత్తిమీద సాము వంటిదే. ఎందుకంటే పోలింగ్ రోజున తమకు ఖచ్చితంగా ఓట్లు పడతాయని భావించిన వాళ్లు రాకుంటే అది ఆ పార్టీకి నష్టం చేయడంతో పాటు ప్రత్యర్థి పార్టీకి నష్టం చేకూరుస్తుంది. అందుకే ఈ మూడు రోజులు ఏపీ ఎన్నికల్లో కీలకంగా మారనుంది.

అదే అడ్వాంటేజీగా...
వైసీపీకి ఉన్న అడ్వాంటేజీ వాలంటీర్లు.. ఒక్కొక్క వాలంటీర్ కు యాభై ఇళ్లు కొట్టిన పిండి కావడంతో నియోజకవర్గంలో నేతలందరూ వాలంటీర్లతో ప్రత్యేకంగా సమావేశం కావాలని ఇప్పటికే పార్టీ అధినాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యే అభ్యర్థులు వాలంటీర్లు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేస్తున్నారు. వాలంటీర్లకు వైసీపీ నేతలు పెద్దమొత్తంలో డబ్బులు కూడా పంచుతున్నట్లు వార్తలు అందుతున్నాయి. లక్ష రూపాయలకు పైగా నగదుతో పాటు ఉత్తరాంధ్రలో ఒక నియోజకవర్గంలో అయితే వాలంటీర్లకు ఖరీదైన సెల్ ఫోన్లను కూడా బహుమతిగా ఇస్తున్నట్లు సమాచారం అందుతుంది. వాలంటీర్లు వైసీపీకి ఓటు వేసే వారిని గుర్తించి వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకు వచ్చే బాధ్యతను అప్పగించినట్లు తెలిసింది.
ద్విచక్రవాహనాలను గిఫ్ట్‌గా...
ఇప్పటికే సగం మందికి పైగా వాలంటీర్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. కానీ వారికి ఉన్న పరిచయాలను ఈ ఎన్నికల్లో ఉపయోగించుకునేందుకు వైసీపీ సిద్ధమయింది. నేతలు ఒకవైపు ప్రచారం చేసుకుంటుండగానే వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి జగన్ పార్టీ గెలిస్తేనే పథకాలు అమలవుతాయని, చంద్రబాబు వస్తే లబ్దిదారుల్లో కోత తప్పదని, అందులో మీరు ఉండరన్న గ్యారంటీ ఉండదని కొందరు బెదరగొడుతున్నారు. కోస్తా జిల్లాలోని ఒక కీలకమైన నియోజకవర్గంలో అయితే వాలంటీర్లకు ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసి ఇస్తామని హామీ ఇస్తున్నట్లు సమాచారం. అంత పెద్ద స్థాయిలో వైసీపీ ఈ ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకుందో దీనిని బట్టి అర్థమవుతుంది. తాము గెలిచిన వెంటనే మోటార్ బైక్ లు మీ ముందుంటాయని కూడా వాలంటీర్లను మభ్యపెడుతున్నారు.
ఓటుకు ఎంతో తెలుసా?
చివరి మూడు రోజుల్లోనే ఓటర్లను ఏ రాజకీయ పార్టీ అయినా ఆకట్టుకునే అవకాశముంది. అందుకే ఈరోజు నుంచే వాలంటీర్లతో పాటు ముఖ్య అనుచరులను కలిపి ఒక టీంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు కలసి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకు రావాల్సి ఉంటుంది. వారి చేత ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాల్సి ఉంటుంది. వారికి అవసరమైన నగదు కూడా వీరిద్వారానే పంపిణీ చేస్తున్నారని సమాచారం. ఓటర్లు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల చొప్పున కొన్ని నియోజకవర్గాల్లో ఇస్తున్నట్లు తెలిసింది. ఉభయ గోదావరి జిల్లాలోని ఒక నియోజకవర్గంలో ఇంట్లో ఎన్ని ఓట్లున్నా సరే ఓటుకు మూడు వేల రూపాయల చొప్పున పంచుతున్నారని తెలిసింది. మొత్తం మీద డెత్ ఓవర్లలో స్కోరును ఛేజింగ్ చేయగల బ్యాటర్లను జగన్ పార్టీ వాలంటీర్ల రూపంలో రంగంలోకి దించినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News