MIM : భాయ్.. నీ సంగతేంటో చెప్పు.. ఏపీలోకి వస్తావా.. రావా?

తెలంగాణలో పుట్టిన ఎంఐఎం ను అన్ని రాష్ట్రాలకు విస్తరించేలా ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు

Update: 2024-04-10 11:57 GMT

తెలంగాణలో పుట్టిన ఎంఐఎం పార్టీ అన్ని రాష్ట్రాలకు విస్తరించేలా ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. అందులో కొంత సక్సెస్ అయ్యారు. మిగిలిన ప్రాంతీయ పార్టీల కంటే బెటర్ గానే కొన్ని రాష్ట్రాల్లో పార్టీ గుర్తు పై అభ్యర్థులు గెలిచేలా కూడా ఆయన శ్రమించారు. తెలంగాణకు పొరుగున ఉన్న మహారాష్ట్రతో పాటు బీహార్ లోనూ కొన్ని స్థానాల్లో ఎంఐఎం గెలిచింది. ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలలోనూ పోటీ చేసింది. చివరకు తమిళనాడు, కర్ణాటకల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులను ఒవైసీ నిలబెట్టి మరీ అక్కడ పార్టీ జెండా ఎగరుతుందని ఆశించారు. ఇలా అన్ని రాష్ట్రాలకు తన పార్టీని విస్తరించాలన్న కసి ఒవైసీలో కళ్లలో కనిపించేది.

ఆరోపణలు వచ్చినా...
అయితే ఎంఐఎం అధినేత ఒవైసీపై ఈ పరిస్థితుల్లో ఆరోపణలు కూడా వినిపించాయి. బీజేపీని గెలిపించడానికే ఒవైసీ పోటీ చేయించుస్తున్నారని కాంగ్రెస్ నేతలు పదే పదే విమర్శించేవారు. యూపీ, బీహార్, గుజరాత్, మహారాష్ట్రలలో పోటీ చేసినప్పుడు ఇవే ఆరోపణలు కాంగ్రెస్ నుంచి వినిపించాయి. కానీ అందుకు ఒవైసీ సమాధానం ఒక్కటే. నా పతంగి ఎక్కడైనా ఎగురుతుంది. నన్ను ఆపేదెవరు? నా పార్టీని విస్తరించడం కోసమే నేను పోటీ చేస్తున్నాననంటూ ఆయన సమాధానమిచ్చేవారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దానితో సాన్నిహిత్యం మొదలు పెట్టారు. ఇప్పుడు హస్తంతో భాయి.. భాయి అంటూ కలసి నడుస్తున్నారు.
ఏపీ ఎన్నికల్లో...
ఇప్పుడు లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అక్కడ పోటీ చేస్తానని మాత్రం ఒవైసీ ఇప్పటి వరకూ ప్రకటించలేదు. గతంలో కర్నూలు, కడప, గుంటూరు వంటి స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం ఈసారి ఆ ప్రయత్నమూ చేయడం లేదు. ఏపీ ఎన్నికలకు ఒవైసీ దూరంగా ఉంటున్నట్లే కనపడుతుంది. ఏపీ వైపు చూసేందుకు ఆయన ఇష్టపడటం లేదు. ఇటు తెలంగాణలో కాంగ్రెస్ తో సఖ్యత ఉన్న నేపథ్యంలో అసదుద్దీన్ ఒవైసీ ఏపీలోనూ దానికి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలాంటి ప్రకటన ఇప్పటి వరకూ అసదుద్దీన్ నోటి నుంచి వెలువడకపోవడంతో అది కూడా జరగదని అంటున్నారు.
జగన్ కు ఆప్తుడిగా....
దీనికి కారణం కూడా లేకపోలేదు. వైఎస్ జగన్ కు ఒవైసీ అత్యంత ఆప్తుడంటారు. గతంలో కేసీఆర్ కు కూడా ఒవైసీ మంచి మిత్రుడే. అయితే బీఆర్ఎస్ ఓటమి పాలయిన తర్వాత మాత్రం ఆ పార్టీ వైపు చూడటం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చెట్టాపట్టాలేసుకుని ఒవైసీ బ్రదర్స్ తిరుగుతున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి మద్దతు ప్రకటించారు. అక్కడ షర్మిల పీీసీీసీ చీఫ్ గా ఉండటంతో ఆయన విశాఖ వెళ్లి మరీ మద్దతిచ్చి వచ్చారు. మరోసారి ఎన్నికల ప్రచారానికి వెళ్లే అవకాశముంది. అదే సమయంలో ఒవైసీ మాత్రం ఏపీ టూర్ వేస్తారా? లేదా? అన్నది మాత్రం తేలలేదు. ఇప్పుడు ఒవైసీ భాయ్ నిర్ణయం ఎలా ఉంటుందో మరి చూడాలి.


Tags:    

Similar News