Nda Alliance : చంద్రబాబు అసహనంలో ఉన్నారా? క్యాడర్ ది కూడా సేమ్ సిట్యుయేషన్ అటగా

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కూటమిలో మాత్రం మనస్పర్థలు ఎక్కువగా కనిపిస్తున్నాయి

Update: 2024-05-01 13:36 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కూటమిలో మాత్రం మనస్పర్థలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంత స్థాయిలో ఉంటే ఒకరికొకరు సహకరించుకునేంత లేని స్థాయిలో విభేదాలున్నాయని భావిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీ పెద్దల వ్యవహార శైలిపై ఒకింత గుర్రుగా ఉన్నారన్న సమాచారతో క్యాడర్ లో కూడా అసహనం బయలుదేరిందంటున్నారు. బీజేపీ పోటీ చేస్తున్న పది అసెంబ్లీ, ఆరు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో తాము ఎందుకు ఆ పార్టీకి సహకరించాలంటూ కొందరు నేరుగా సోషల్ మీడియా వేదికగానే ప్రశ్నిస్తున్నారు. ఇందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. కమలం తమను కౌగిలించుకున్నట్లుగానే భ్రమించి వెనక నుంచి కత్తిపోట్లు పొడిచినట్లుగా వ్యవహరిస్తుందన్న వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్ల నుంచి వినిపిస్తున్నాయి.

కూటమిలో లేనట్లుగానే...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇష్టం లేనట్లుగానే కూటమి ఏర్పడినట్లుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. రాష్ట్ర బీజేపీ నేతలను పక్కన పెడితే ఢిల్లీ పెద్దలు అయితే అసలు తాము ఏపీలో కూటమిలో లేనట్లుగానే వ్యవహరిస్తున్నారన్న ధోరణిని కనబరుస్తున్నారు. తెలంగాణలో కేవలం పదిహేడు స్థానాలు మాత్రమే ఉన్నాయి. అదే ఏపీలో ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. కానీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూడా కనీసం ఏపీ వైపు కన్నెత్తి చూడకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏపీలో తాము కూటమిలో లేనట్లుగానే ఢిల్లీ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికిప్పుడు వదలుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని సీనియర్ టీడీపీ నేత ఒకరు వ్యాఖ్యానించడం పరిస్థిితికి అద్దం పడుతుంది.
ప్రచారం గడువు ముగిసే సమయంలో...
జనసేన ఒక్కదానితోనైనా పొత్తు పెట్టుకుంటే పోయేదన్న కామెంట్స్ టీడీపీ నేతల నుంచి వినపడుతున్నాయి. అందుకే తాము బీజేపీ పోటీచేస్తున్న నియోజకవర్గాల్లో అభ్యర్థులకు ఎందుకు సహకరించాలన్న ప్రశ్నను టీడీపీ క్యాడర్ నుంచి వినపడుతుంది. తెలంగాణలో అమిత్ షా, మోదీ వరస పర్యటనలు చేస్తున్నా ఏపీకి ఒక్కసారి కూడా రాలేకపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బహుశ వస్తే చివరిలో ఒకటో రెండో సభలకు మోదీ హాజరయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నా ఈపాటి దానికి ఎందుకు పొత్తు పెట్టుకోవాలని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ అధినేతతో లోపాయి కారీ ఒప్పందం ఉండటం వల్లనే ఏపీకి రావడానికి ఢిల్లీ పెద్దలు ఇబ్బంది పడుతున్నారన్న అభిప్రాయం ఎక్కువగా టీడీపీ నేతల్లో వినిపిస్తుంది.
మ్యానిఫేస్టో సమయంలోనూ...
మరోవైపు మ్యానిఫేస్టో లో కూడా మోదీ ఫొటో లేకుండా చేయడమంటే .. తాము అంటీముట్టనట్లుగానే ఉంటామని బీజేపీ నేరుగా చెప్పేసినట్లేగదా? అన్న ప్రశ్న టీడీపీ నేతల నుంచి వినపడుతుంది. ఈ మ్యానిఫేస్టో విడుదలకు మొక్కుబడిగా హాజరయిన బీజేపీ నేత సిద్ధార్ధ్‌సింగ్ కూడా మ్యానిఫేస్టోను పట్టుకోవడానికి కూడా నిరాకరించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అదేమంటే..తమది జాతీయ పార్టీ అని తమ మ్యానిఫేస్టో వేరని మభ్యపెడుతున్నారని, కావాలనే మ్యానిఫేస్టో కార్యక్రమంలో పాల్గొని తమ పార్టీ క్యాడర్ కు సంకేతాలు కూడా పంపినట్లయిందన్నది టీడీపీ నేతల అభిప్రాయంగా వినిపిస్తుంది. దీంతో పాటు కీలకమైన అధికారుల బదిలీలు, ఎలక్షనీరింగ్ విషయంలోనూ తమకు బీజేపీ సహకరించడం లేదన్న ఆరోపణలు టీడీపీ నుంచి వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News