Ap Elections : జూన్ 4న ఏపీలో బంద్ వాతావరణం.. ప్రయాణం ఉంటే వాయిదా వేసుకోండి

ఆంధ్రప్రదేశ్ లో జూన్ 4న బంద్ వాతావరణం ఏర్పడనుంది. సున్నిత ప్రాంతాల్లో వ్యాపారాలను మూసివేయాలని పోలీసులు కోరుతున్నారు

Update: 2024-05-30 06:41 GMT

ఆంధ్రప్రదేశ్ లో జూన్ 4వ తేదీన బంద్ వాతావరణం ఏర్పడనుంది. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ ప్రాంతాాల్లో బందోబస్తును తీవ్రతరం చేశారు. కౌంటింగ్ సమయంలో పెద్దయెత్తున ఘర్షణలు తలెత్తే అవకాశాలున్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్దయెత్తున బలగాలు మొహరించాయి. మద్యం దుకాణాలను మూడు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించారు.

కొత్త వారికి నో ఎంట్రీ...
ఇక కౌంటింగ్ ముందు రోజు, ఆరోజు కొత్త వారికి నియోజకవర్గంలోకి ప్రవేశించడానికి వీలులేదని ఆంక్షలు పెట్టారు. కొత్తవారు ఎవరూ అనుమతి లేనిదే నియోజకవర్గాల్లోకి అడుగుపెట్టడానికి వీల్లేదని చెప్పారు. కొత్తవారికి లాడ్జీలు కూడా ఎవరూ ఇవ్వవద్దంటూ వాటి యజమానులకు పోలీసులు హెచ్చరించారు. కొత్త వారు ఎవరైనా వస్తే తమకు సమాచారం అందించాలని కూడా చెప్పారు. అల్లర్లను అదుపు చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది కాబట్టి ఎలాంటి గుంపులుగా కనిపించినా అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రదర్శనలు, బాణా సంచా కాల్పులకు అనుమతి లేదని తెలిపారు. ముందు రోజు సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో మార్చ్ నిర్వహించనున్నారు.
ఆర్టీసీ బస్సులు...
మరోవైపు ఆర్టీసీ బస్సులను కూడా పట్టణాలకు వెలుపలే ఆపాలని కూడా పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులు డిపోకు రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆస్తులకు ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే నష్టం జరగకుండా ఉండేందుకు ఈ రకమైన చర్యలు తీసుకున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకపోవడమే బెటర్. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. దీంతో పాటు మద్యం ఎక్కడైనా విక్రయించినట్లు కనిపించినా అంగీకరించేది లేదని తెలిపారు. ఇక వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా మూసివేయాలని సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆరోజు దుకాణాలు ఎవరూ తెరవవద్దని కూడా చెప్పారు. ఇక పెట్రోలు కూడా విడిగా బాటిల్స్ లో పోస్తే పెట్రోల్ బంకులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. కేవలం వాహనాల్లోనే పెట్రోలు నింపాలని పేర్కొంది.


Tags:    

Similar News