IPL, Ap Elections 2024 : ఐపీఎల్‌కు ఏపీ ఎన్నికలకు సంబంధం ఏంటి భయ్యా? ఇలా కూడా అంటగడతారా?

ముగిసిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఐపీఎల్ కు ముడిపెడుతూ సోషల్ మీడియాలో ఎవరికి వారే తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు.

Update: 2024-05-27 12:49 GMT

ముగిసిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఐపీఎల్ కు ముడిపెడుతూ సోషల్ మీడియాలో పెద్దయెత్తున ఎవరికి వారే తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఆసక్తికరంగా సాగాయి. ఐపీఎల్ 17వ సీజన్ కూడా ఇదే తరహాలో ఉత్కంఠగా సాగింది. లీగ్ మ్యాచ్ ల నుంచి ప్లే ఆఫ్ ల వరకూ ఏ జట్టు చేరుకుంటుందన్నది ఎవరికీ అంచనాలకు అందలేదు. అంచనాలు ఉన్న జట్లు ప్లేఆఫ్ కు చేరుకోలేదు. అలాగే సీజన్ ప్రారంభంలో వరస ఓటములను చవి చూసిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ప్లే ఆఫ్ కు చేరుకుంది.

అంచనాలకు భిన్నంగా...
దీంతో ప్లే ఆఫ్ లో గెలిచి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ గెలిచి ఫైనల్స్ కు చేరుకుంటుందని కూడా వేసిన కొందరి అంచనా నిజం కాలేదు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ తొలి నుంచి బాగా ఆడినా చివరకు ప్లే ఆఫ్ కు చేరలేకపోయింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్స్ లో గెలిచి తీరుతుందని అనేక మంది అంచనాలు వేశారు. కానీ చివరకు కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు ఛాంపియన్స్ గా నిలిచింది. ఫైనల్స్ మ్యాచ్ మాత్రం చప్పగానే సాగింది. వన్ సైడ్ తో కేకేఆర్ కప్పును సొంతం చేసుకుంది.
2014లో కేకేఆర్ గెలిచిందని...
దీంతో కూటమికి అనుకూలురైన కొందరు 2014లో ఐపీఎల్ ఛాంపియన్ గా కోల్‌కత్తా నైట్ రైడర్స్ గెలిచిందని, ఆ ఏడాది ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో అప్పుడు ఎన్డీఏ గెలిచిందని చెబుతున్నారు. మళ్లీ 2024లో జరిగిన ఐపీఎల్ లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ గెలిచిందని, ఇప్పుడు అంటే 2024 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమి గెలుస్తుందని సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు. ఈసారి కూటమి గెలుపు ఖాయమంటూ ఇది కేకేఆర్ గెలుపుతో ముందే తెలిసిందని అంటున్నారు.
ఎల్లో బ్యాచ్ ఓటమి పాలయిందంటూ...
ఇక వైసీపీ అభిమానులు మరో అడుగు ముందుకేసి.. ఈసారి వైసీపీ విజయం ఖాయమని చెబుతున్నారు. ఎల్లో బ్యాచ్ ఐపీఎల్ లో ప్లేఆఫ్ కు కూడా చేరుకోలేదని, బ్లూస్ మాత్రమే గెలిచిందని సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు. చెన్నె సూపర్ కింగ్స్ ఎల్లో జెర్సీ కావడం, కేకేఆర్ ది బ్లూ జెర్సీలు కావడంతో దానిని ఫ్యాన్ పార్టీ అభిమానులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. మొత్తం మీద మనోళ్లు ఐపీఎల్ ను కూడా వదిలపెట్టకుండా ఏపీలో ఎన్నికల ఫలితాలకు ముడిపెడుతూ ముందే ఫలితాలను చెప్పేస్తున్నారు.


Tags:    

Similar News