Chandrababu : మూడు నెలల పింఛను ఒకేసారి ఇస్తాం.. అదీ ఇంటివద్దకే వచ్చి ఇస్తాం
పింఛను చెల్లించడానికి ఇబ్బంది పెడితే తాము అధికారంలోకి రాగానే అంతా కలిపి ఒకేసారి చెల్లిస్తామని చంద్రబాబు తెలిపారు.
ఈ మూడు నెలలు పింఛను చెల్లించడానికి ప్రభుత్వం ఇబ్బంది పెడితే తాము అధికారంలోకి రాగానే అంతా కలిపి ఒకేసారి చెల్లిస్తామని చంద్రబాబు తెలిపారు. నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున పింఛను ఇస్తామని చెప్పారు. అంతా కలిపి జులై నెలలో అధికారంలోకి రాగానే చెల్లిస్తామని అన్నారు. వరసగా మూడు నెలలు తీసుకోకపోయినా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పారు. పింఛన్ల పంపిణీ తాను చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి చెప్పానని, అయినా ప్రభుత్వం పేదలను ఇబ్బంది పెట్టిందని ఆయన వివరణ ఇచ్చారు.
కావాలనే కష్టపెట్టారు...
కావాలని పేదలను సచివాలయానికి రమ్మన్నారన్నారు. చివరకు వృద్ధులు, రోగులను కూడా సచివాలయానికి వచ్చి పింఛను ను తీసుకోవాలని చెప్పారన్నారు. ఇది మంచి విషయం కాదని తాను చెప్పినా వినిపించుకోలేదన్నారు. ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ముఖ్యకార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, మురళీధర్ రెడ్డిలు పింఛన్ల పంపిణ ీసక్రమంగా చేయకపోవడానికి కారణమని ఆయన ఆరోపించారు. దీనిపై ఎన్నికల కమిషన్ విచారణ చేయించి నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు కోరారు.
తొలి సంతకం...
తాను అధికారంలోకి రాగానే తొలి సంతకం డీఎస్సీపైనే పెడతానని చెప్పారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. మహిళలకు అండగా ఉంటానని చెప్పారు. ఈ అవినీతి, దుర్మార్గ ప్రభుత్వాన్ని పారదోలేందుకే తాము మూడు పార్టీలు కలసి పోరాడాల్సి వచ్చిందన్నారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా కూటమిదే అధికారమని ఆయన తెలిపారు. ప్రజలు రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని పిలుపు నిచ్చారు. మరో సారి తప్పు చేయవద్దని అన్నారు.