Ap Elections : ఐఏఎస్, ఐపీఎస్‌లు అంత తోపులా..? వాళ్లకేమైనా అతీత శక్తులున్నాయా?

ప్రజల నాడి ముందుగానే ఐఏఎస్, ఐపీఎస్ లకు తెలిసిపోయిందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో కొందరు అభిప్రాయపడుతున్నారు

Update: 2024-05-31 06:58 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు మరో నాలుగు రోజుల్లో వెలువడనున్నాయి. అయితే ప్రజల నాడి ముందుగానే ఐఏఎస్, ఐపీఎస్ లకు తెలిసిపోయిందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో కొందరు అభిప్రాయపడుతున్నారు. వారు ప్రజా క్షేత్రంలో ఉంటారు కాబట్టి.. ఉద్యోగుల నుంచి అంటే తమకు సన్నిహితులైన పోలింగ్ సిబ్బంది నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ప్రకారం వారి అడుగులు ఉంటాయంటారు. ఏ ప్రభుత్వం రావడానికి అవకాశం ఉందని భావిస్తే ఆ పార్టీకి అనుకూలంగా అణుకువగా వ్యవహరిస్తారన్నది ఎందరో వెలువరిస్తున్న అభిప్రాయం. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఒకప్పుడు వేరు. గత కొన్నాళ్లుగా వారు కూడా రూటు మార్చారు.

అధికారంలో ఉన్న పార్టీకి...
దేశమంతటా ఇలాగే ఐఏఎస్, ఐపీఎస్ లు ఉండి ఉండటానికి ఎక్కువ అవకాశాలున్నాయి. అధికార పార్టీ చెప్పినట్లు చేయడం తో వారికి మంచి పోస్టింగ్ లు లభ్యమవుతాయి. ప్రభుత్వంలో ప్రయారిటీ ఉంటుంది. అందరూ రాజకీయ నేతలతో పాటు వారిని కూడా అతిగా గౌరవిస్తారు. వారితో ఏ పనైనా పూర్తవుతుందని భావిస్తారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు మినహాయింపు కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అరవింద్ కుమార్, జయేష్ రంజన్, సోమేష్ కుమార్ లాంటి వాళ్లు ఒక ఊపు ఊపారు. వాళ్ల హవా అలా నడిచింది. అయితే ఎన్నికల సమయంలో తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ లు కూడా కాంగ్రెస్ వస్తుందని పసిగట్టలేకపోయారు. తెలంగాణలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ అధికారుల్లో మత్రం మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తారన్న నమ్మకమే ఎక్కువగా కనపడింది.
1999లో రమణాచారి...
చివరకు అప్పటి డీజీపీగా ఉన్న అంజనీకుమార్ రిజల్ట్‌ ను చూసి రేవంత్ రెడ్డిని కలసి తన పదవిని పోగొట్టుకున్నారు. ఇలాగే 1999 ప్రాంతంలో అనుకుంటా. అప్పుడు ఐఏఎస్ అధికారిగా ఉన్న రమణాచారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదని అంచనా వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన నమ్మారు. అందుకే ఆయన ఎన్నికల ఫలితాల కంటే ముందే వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిశారు. అప్పట్లో అది ఐఏఎస్ వర్గాల్లో కలకలం రేగింది. కానీ ఆ ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. వెంటనే రమణా చారిని అప్రధాన్య పోస్టుకు పంపారు. ఐదేళ్ల పాటు ఆయన అక్కడే పెద్దగా పనిలేకుండా గడపాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో అధికారంలోకి వచ్చే పార్టీ పట్ల ఐఏఎస్, ఐపీఎస్ లు మొగ్గు చూపుతున్నారన్న వార్తలు వస్తున్నాయి.
అంచనా వేసేందుకు...
కానీ పోలింగ్ సరళిని అంచనా వేసేంత పరిజ్ఞానం వారికి ఉండదని చెప్పాల్సి ఉంటుంది. కాకుంటే ఐఏఎస్ లకంటే ఐపీఎస్ లు తమ శాఖ పరిధిలోని ఇంటలిజెన్స్ నివేదికలను అనుసరించి గెలుస్తుందన్న పార్టీ అధినేతలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఇంటలిజెన్స్ శాఖ అంచనాలు కూడా కరెక్ట్ గా ఉంటాయని చెప్పలేని పరిస్థితి. వాళ్లు కూడా జనం మూడ్ ను తెలుసుకుని అలా పైపైన అంచనాలు రూపొందిస్తారన్నది వాస్తవం. అందులో ఈసారి ఏపీలో జరిగిన ఎన్నికలలో జనం మూడ్ పసిగట్టలేకపోతున్నారు. ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఎవరైనా అధికారంలోకి రావచ్చు. అయినాసరే తమకు వచ్చిన నివేదికలతో కొందరు ఐఏఎస్, ఐపీఎస్ లు పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారంటే అది వారు అత్యుత్సాహమే అని అనుకోవాల్సి ఉంటుంది. అంతకు మించి మరొకటి లేదు.


Tags:    

Similar News