Rahul Gandhi : కడపలో రాహుల్ గాంధీ.. షర్మిల ఎదుటే జగన్ పై అవినీతి ఆరోపణలు

కడపలో రాహుల్ గాంధీ వైఎస్ జగన్ పై విమర్శలు చేశారు. జగన్ అవినీతి పరుడంటూ ధ్వజమెత్తారు

Update: 2024-05-11 08:08 GMT

అందరికీ నమస్కారం.. జోహార్ వైఎస్సార్ అంటూ రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ప్రారంభించారు. కడపలో ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. రాజకీయాల్లో అనేక సంబంధాలుంటాయని, రక్తసంబంధాలుంటాయని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన తండ్రి సోదరుడు అని అన్నారు. వారిద్దరిదీ రాజకీయ సంబంధం కాదని, అన్నాతమ్ముళ్లలా కలసి ఉండేవారన్నారు. సుదీర్ఘకాలం వారి సంబంధం కొనసాగిందన్నారు. వైఎస్ రాష్ట్రానికి మాత్రమే కాదని, దేశానికి దారి చూపించారన్నారు. ఏపీలో వైఎస్ చేసిన పాదయాత్ర తాను భారత్ జోడో యాత్రకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. తండ్రి మరణించిన తర్వాత వైఎస్ తనకు పొలిటికల్ మెంటర్ గా ఉన్నారన్నారు. కడప సభకు హాజరయ్యే ముందు ఆయన ఇడుపుల పాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.

పాదయాత్ర ద్వారా...
పాదయాత్రలో ప్రజల సమస్యలను అనేకం అర్థం చేసుకున్నామని తెలిపారు. భారత్ జోడో యాత్ర చేశానంటే అది వైఎస్ ఆలోచన నుంచి వచ్చిందేనని అన్నారు. వైఎస్ రాజకీయం పేదల కోసమే ఉంటుందని, సామాజిక న్యాయం కోసమే పనిచేశారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏపీ ఆలోచనలను ఢిల్లీలో ప్రతిధ్వనించేవారన్నారు. ఈరోజు బాబు, జగన్, పవన్ బీజేపీ అని, వీరి ఆలోచనల రిమోట్ కంట్రోల్ నరేంద్ర మోదీ చేతుల్లో ఉందన్నారు. నరేంద్ర మోదీ చేతిలో ఈడీ, సీబీఐ ఉందని, అందుకోసమే వారంతా ఆయన చెప్పు చేతుల్లో ఉన్నారన్నారు. వైఎస్, కాంగ్రెస్ సిద్ధాంతం ఎప్పుడూ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాయన్నారు. జగన్ మాత్రం బీజేపీని ఒక్క మాట కూడా అనడం లేదన్నారు.

అవినీతి ఆరోపణలు...
వైఎస్ జగన్ పై అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి. ఇదే అలవాటు చంద్రబాబుకు కూడా ఉందన్నారు. మీ ఆలోచనలు ఢిల్లీలో వినపడాలంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిలను గెలిపించాలన్నారు. ఏపీ విభజన జరిగిన తర్వాత ఢిల్లీ చేసిన వాగ్దానాలను నేటి వరకూ అమలు చేయలేదన్నారు. ప్రత్యేక హోదాఇవ్వలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశారా? కడప స్టీల్ ప్లాంట్ నిర్మించారా? అని ప్రశ్నించారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయిందన్నారు. వాళ్లు అవినీతి ఊబిలో కూరుకుపోయి ఉన్నారన్నారు. 2024 లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తామని తెలిపారు. పది సంవత్సరాలు ప్రత్యేక హోదాను ఇస్తామని తెలిపారు.


Tags:    

Similar News