Ys Jagan : వీళ్లనా జగనన్నా నువ్వు ఎమ్మెల్సీలుగా చేసింది... వైసీపీ క్యాడర్ సూటి ప్రశ్న
వైఎస్ జగన్ సెలక్షన్ పై క్యాడర్ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీలు పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు
నమ్మి పదవులు ఇచ్చిన వాళ్లే కాదని వెళ్లిపోతున్నారు.. సీటు రాలేదని కొందరు.. సరైన గౌరవం లేదని మరికొందరు... ఎన్నికల సమయంలో జగన్ ను వదిలి వెళ్లిపోతున్నారు. తాను అధికారంలో ఉన్నా లేకున్నా ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిన వాళ్లే నేడు కాదనుకుని వెళ్లిపోతుండటాన్ని ఫ్యాన్ పార్టీ క్యాడర్ జగన్ ను సూటిగా ప్రశ్నిస్తుంది. ఇది నువ్వు చేసుకున్న తప్పిదమా? లేక మరేదైనా కారణమా? అన్న సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతున్నాయి. వరసగా ఎమ్మెల్సీ పదవులను వదిలపెట్టి మరీ వెళ్లిపోతుండటాన్ని పార్టీ నేతలు సయితం క్యాడర్ కు సర్దిచెప్పలేక ఇబ్బందులు పెడుతున్నారంటే జగన్ ఎంపిక ఏ విధంగా జరిగిందో ఇక వేరే చెప్పనక్కర లేదనుకుంటా.
తొలి ఎమ్మెల్సీని చేసినా...
జంగా కృష్ణమూర్తి... బీసీ నేత.. 2019 లో తొలి ఎమ్మెల్సీ పదవిని ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తున్నట్లు ఏలూరులో జరిగిన బీసీ సదస్సులో జగన్ ప్రకటించారు. అనుకున్నట్లుగానే వైసీపీ అధికారంలోకి రాగానే ఆయనను ఎమ్మెల్సీని చేశారు. 2019 నుంచి 2025 వరకూ ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతారు. 1999, 2004 లో ఆయన వరసగా రెండు సార్లు కాంగ్రెస్ నుంచి గురజాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. గురజాల టిక్కెట్ కాసు మహేష్ రెడ్డికి ఇవ్వడంతో ఆయనకు ఈసారి వైసీపీ సీటు దక్కలేదు. చివర వరకూ టిక్కెట్ కోసం ప్రయత్నించిన జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరారు. అయితే టీడీపీలోనూ ఆయనకు ఎలాంటి టిక్కెట్ దక్కలేదు. కానీ జగన్ ను వదిలి వెళ్లిపోయారు.
పార్టీలు మారి వచ్చినా...
సి. రామచంద్రయ్య...సీనియర్ నేత.. టీడీపీ.. ప్రజారాజ్యం.. కాంగ్రెస్ .. వైసీపీ ఇలా దాదాపు అన్ని పార్టీలు మారి వచ్చారు. 2019 ఎన్నికలకు ముందు చేరిన ఆయనను జగన్ దగ్గరకు తీసి ఎమ్మెల్సీని చేశారు. కడప జిల్లాకు చెందిన సి. రామచంద్రయ్య గతంలో టీడీపీలో ఉన్నప్పుడు రాజ్యసభ సభ్యుడిగా చేశారు. కాంగ్రెస్ లో చేరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరి మరోసారి శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇలా ప్రజల్లోనుంచి కాకుండా పరోక్ష ఎన్నికతో ఆయన చట్టసభల్లోకి అడుగుపెడుతూనే ఉన్నారు. కడప జిల్లాకు చెందిన బలిజ సామాజికవర్గానికి చెందిన సి.ఆర్ ను జగన్ ఏరికోరి ఎంపిక చేశారు. చివరకు జగన్ కు అవసరమైన సమయంలో మాత్రం తాను అందలం ఎక్కించిన వాళ్లే పార్టీని వదిలి వెళ్లారు.
రెండు సార్లు ఎమ్మెల్సీగా...
మహ్మద్ ఇక్బాల్... మాజీ పోలీసు అధికారి.. జగన్ రెండుసార్లు ఎమ్మెల్సీని చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన వారయినా అనంతపురం జిల్లా హిందూపురం లో వైసీపీ తరుపున పోటీ చేయడానికి అవకాశమిచ్చారు. ఈయన 2019 ఎన్నికల్లో హిందూపురం నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓడిపోయినా మరోసారి టిక్కెట్ ను ఆశించారు. కానీ జగన్ వేరే వాళ్లకు ఆ అవకాశం ఇవ్వడంతో జీర్ణించుకోలేక పార్టీకి గుడ్ బై చెప్పేశారు. జగన్ తనను నమ్మిన వాళ్లను కాకుండా తాను నమ్మిన వాళ్లనే ఎమ్మెల్సీగా చేశారన్న విమర్శలయితే బాగా వినిపిస్తున్నాయి. ఇలా పదవులను పార్టీని వదిలి వెళ్లే వారికి పంచిపెట్టి జగన్ అసలైన నేతలకు అన్యాయం చేస్తున్నారన్న వాదనలు కూడా పార్టీలో వినిపిస్తున్నాయి. వీటికి మాత్రం జగన్ వద్ద నుంచి బహుశ సమాధానం వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే.. తన ఎంపిక తప్పు అని ఆయన క్యాడర్ ముందు ఒప్పుకుని తీరాల్సిందే.