YSRCP : జగన్ దెబ్బకు సీనియర్ నేత బలి.. ఓడిపోతే కారణం అధినేతే కారణమట
శ్రీకాకుళం జిల్లాలోని సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు గెలుపుపై హైరానాపడుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు గెలుపుపై హైరానాపడుతున్నారు. ఆయన ఈసారి గెలుపు కోసం శ్రమించాల్సి ఉంటుందట. ధర్మాన ప్రసాదరావు ఈసారి తనను ఒగ్గేయమని, తన కుమారుడికి అవకాశమివ్వాలని, తాను రాజకీయంగా విశ్రాంతి తీసుకుంటానని చెప్పిన జగన్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు.. లేదు.. లేదు.. అన్నా నువ్వు పోటీ చేయాల్సిందే అంటూ బలవంతంగా రంగంలోకి దించారు. అయితే ధర్మాన ప్రసాదరావు లాంటి నేతలకు శ్రీకాకుళం లాంటి నియోజకవర్గాల్లో తిరుగులేకుండా ఉండాలి. కానీ సీన్ చూస్తే మాత్రం అలా లేదట. ఎక్కడో తేడా కొడ్తున్నట్లు ఆయనకు డౌటు కొడుతుందన్న కామెంట్స్ ఆయన వర్గం నుంచే వినపడుతున్నాయి.
మూడు సార్లు గెలిచినా....
ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇప్పటికి మూడుసార్లు గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా కూడా పనిచేశారు. మంచి వాగ్దాటి ఉంది. సబ్జెక్ట్ పై కమాండ్ ఉంది. ఆయన మాట్లాడుతుంటే అరటి పండు తోలు ఒలిచి నోట్లో పెడుతున్నట్లుగా ఉంటుంది. ఆయన ప్రసంగం విన్న వారు ఎవరికైనా చివరకు ప్రత్యర్థి పార్టీ నేతలకైనా ధర్మాన మంచి వక్త అని అనిపించక మానదు. ధర్మాన ప్రసాదరావుకు జగన్ రెండోవిడత విస్తరణలో భాగంగా తన కేబినెట్ లో చోటు కల్పించారు. అయినా పదిహేనేళ్లు శ్రీకాకుళం నియోజకవర్గంలో పనిచేసినా ఆయన విషయంలో కొంత అసంతృప్తి ఉంది.
కొత్త లీడర్ ను...
అయితే ఈసారి టీడీపీ కూడా సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుకు చెక్ పెట్టేందుకు ప్లాన్ మార్చింది. గుండ కుటుంబాన్ని పక్కన పెట్టింది. గుండ కుటుంబం కూడా మూడుసార్లు సిక్కోలు నుంచి విజయంం సాధించారు. ఈసారి కూడా తమకే టిక్కెట్ అనుకున్నప్పటికీ వారిని పక్కన పెట్టి ఈసారి గొండు శంకర్ కు ఇచ్చింది. దీంతో గుండ కుటుంబం తాము రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. గుండ కుటుంబం అయితే పోటాపోటీ ఉండేదని ధర్మాన ప్రసాదరావు భావించారు. కానీ గొండు శంకర్ కు ఇవ్వడంతో తన గెలుపు సులువుగా మారుతుందని భావించినా క్షేత్రస్థాయిలో మాత్రం అది కాదని తేలుతుందట. ఇక్కడ బలం టీడీపీ కన్నా జగన్ విధానాలపై వ్యతిరేకత తనను దెబ్బతీస్తుందని ఆయన చేయించుకున్న సర్వేల్లో స్పష్టమయిందంటున్నారు.
పట్టణ ఓటర్లు...
శ్రీకాకుళం నియోజకవర్గంలో గెలవాలంటే పట్టణ ఓటర్లే కీలకం. అయితే ఈసారి పట్టణాల్లో ఓటర్లు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు. ప్రధానంగా ఉద్యోగులు, వ్యాపార వర్గాలు, మధ్యతరగతి ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని చేయించుకున్న సొంత సర్వేలో తేలడంతో ఆయన తాను ఓడిపోవడం అంటూ జరిగితే అది జగన్ వల్లనేనని అంటున్నారట. సులువుగా గెలవాల్సిన స్థానం నుంచి గెలవలేదంటే.. తన పైన వ్యతిరేకత కన్నా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎక్కువగా టీడీపీకి అనుకూలంగా మారడం వల్లనేనని ఆయన వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిసింది. మొత్తం మీద ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లాలో ఈసారి గెలుపు కోసం చెమటోడుస్తున్నారు. మరి చివరకు సిక్కోలు ప్రజలు చివరకు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారన్నది మాత్రం ఫలితాల తేదీ జూన్ 4వ తేదీన మాత్రమే తెలియాల్సి ఉంది.