TDP : పరిటాల.. వరదాపురం సూరి..ఇద్దరు టిక్కెట్ కోసం పోటీ పడ్డారు.. మధ్యలో వచ్చిన ఆయన?
ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం ఆసక్తికరంగా మారింది. సత్యకుమార్‌కు టిక్కెట్ దక్కడంతో ఇద్దరు నేతలకు షాక్ తగిలినట్లయింది
ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అవతల బలమైన అభ్యర్థి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఉన్నారు. ఈ సమయంలో ధర్మవరం టిక్కెట్ పంచాయతీలో ఇద్దరు నేతలు కొట్లాడుకోగా మధ్యలో మరొక వ్యక్తి టిక్కెట్ ను ఎగరేసుకుపోయారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి, నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ లు తమకు టిక్కెట్ కావాలంటే తమకు కావాలంటూ ఇద్దరూ అమితుమీకి దిగారు. మీడియా సమావేశాలు పెట్టి మరీ ఒకరిపై ఒకరు బురద జల్లుకున్నారు. ఒకరి గురించి మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఇద్దరూ బలమైన నేతలు కావడంతో ఎవరో ఒకరికే వస్తుందని అందరూ అనుకున్నారు.
బీజేపీలో చేరడంతో...
2014లో వరదాపురం సూరి టీడీపీ నుంచి ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికలలో ఓటమి తర్వాత ఆయన అనూహ్యంగా టీడీపీని వీడి బీజేపీలో చేరిపోయారు. తనకు బీజేపీలో ఉంటే అన్ని రకాలుగా రక్షణ ఉంటుందని నమ్మి ఆయన ఆ పార్టీ కండువా కప్పేసుకున్నారు. దీంతో చంద్రబాబునాయుడు ధర్మవరానికి పరిటాల శ్రీరామ్ ను ఇన్‌ఛార్జిగా నియమించారు. నాలుగేళ్ల నుంచి పరిటాల శ్రీరామ్ ధర్మవరంలో పార్టీ బాధ్యతలను చూసుకుంటున్నారు. టీడీపీ క్యాడర్ బయటకు వెళ్లకుండా అంతా తానే అయి పార్టీ జెండాను అక్కడ నిలబెడుతూ వచ్చారు. అదే సమయంలో అక్కడ జనసేన కూడా బలంగానే ఉంది.
కుటుంబానికి ఒకే టిక్కెట్...
టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం కుటుంబంలో ఒకరికే టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఫ్యామిలీ ప్యాక్ ఉండబోదని కొద్దిరోజుల క్రితం పరిటాల కుటుంబానికి సూత్రప్రాయంగా తెలిపారు. రాప్తాడు నుంచి పరిటాల సునీతను అభ్యర్థిగా ప్రకటించారు. అయితే తాను ఇన్ని రోజులు పడిన కష్టానికి టిక్కెట్ ఇవ్వాలంటూ పరిటాల శ్రీరామ్ టీడీపీ అధినేతకు పదే పదే కోరారు. అయినా అక్కడ ప్రత్యేక పరిస్థితుల కారణంగా తాను టిక్కెట్ ఇవ్వలేమని చెప్పారు. ధర్మవరంలో పరిటాల కుటుంబానికి ప్రత్యేకమైన ఓటు బ్యాంకు ఉందని, ఈసారి తనకు టిక్కెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని పరిటాల శ్రీరామ్ చెబుతున్నప్పటికీ కుటుంబానికి ఒకే టిక్కెట్ పాలసీతో ఆయనకు టిక్కెట్ దక్కలేదు. దీంతో పరిటాల కుటుంబం ఇప్పడు రాప్తాడు నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది.
తనకే టిక్కెట్ వస్తుందని...
ఏపీలో పొత్తులు ఏర్పడి కూటమి ఖాయం కావడంతో ధర్మవరం టిక్కెట్ ఎవరికి వస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. బీజేపీ నుంచి వరదాపురం సూరికి ధర్మవరం టిక్కెట్ ఖచ్చితంగా వస్తుందని ఆయన అనుచరులు ఆశించారు. ఎందుకంటే అక్కడ ఆ పార్టీకి అంతకు మించిన నేత మరొకరు లేరు. దీంతో టిక్కెట్ తనదేనని భావించారు. అయితే చివరి నిమిషంలో బీజేపీ అధినాయకత్వం ఝలక్ ఇచ్చింది. సత్యకుమార్ ను అభ్యర్థిగా బీజేపీ నాయకత్వం ప్రకటించింది. దీంతో వరదాపురం సూరి వర్గీయులు ఫైర్ అవుతున్నారు. ఆయన రానున్న ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద పిట్ట పోరు.. పిట్ట పోరు పిల్లి తీర్చిందన్న సామెతను గుర్తు చేస్తూ పరిటాల, వరదాపురం సూరిలు సీటు కోసం కొట్లాడుకుంటే సత్యకుమార్ మధ్యలో టిక్కెట్ ఎగరేసుకుపోయినట్లయింది.